ప్రేమంటే రెండు మనసులు.. పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు.. రెండు కుటుంబాలు. ఇదంతా అందరూ చెప్పేదే. కానీ, పెళ్లి విషయంలో కొందరు చేసే పనులు తమ భాగస్వాములను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక్కడ ఆ యువతి ఇష్టంలేని పెళ్లి చేసుకుంది. కానీ, శిక్ష మాత్రం అబ్బాయికి పడింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్, విశ్వకర్మ పోలీస్ స్టేషన్‌లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి 2021, నవంబర్ 17వ తేదీన ఓ యువతితో పెళ్లయింది.
రెండు కుటుంబాల సమ్మతితోనే ఈ పెళ్లి జరిగింది. కానీ, ఆ యువకుడు అంటే యువతికి ఇష్టం లేదు. ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ విషయం వినగానే అతడికి ఏం అర్థం కాలేదు. ఆమెకు సర్థి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, కుదరలేదు. రోజులు గడుస్తున్నాయి. ఆమె మాత్రం అతడ్ని భర్తగా చూడటం లేదు.
ఈ విషయం అత్తామామలకు చెప్పాడు. వాళ్లు కూతురికి సర్థి చెప్పాల్సింది పోయి, అతడ్నే తిట్టారు. భార్య ప్రియుడి నుంచి కూడా బెదిరింపులు రావటం మొదలయ్యాయి. అతడు భార్యకు సర్థిచెప్పాలని చూసిన ప్రతీసారి’’ నేను అశోక్‌కు మాత్రమే సొంతం. నేను అతడితోనే ఉంటాను’’ అని అనేది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపుతానిని బెదిరించాడు. అశోక్ రంగంలోకి దిగి కామ్‌గా ఉండాలని బెదిరించాడు. ఓ సారి ఇంటికి వచ్చి కొట్టాడు. భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక.. తనను వాళ్లనుంచి కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.