స్పోర్ట్స్ డెస్క్- టీమిండియాపై ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ టిమ్ పైన్ అసంబద్ద ఆరోపణలు చేయడం వివాదాస్పదమవుతోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్ ను అద్పుతమైన ఆట తీరుతో గెలిచిన విషయాన్ని ఎవరు మరిచిపోరు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైనా, కీలక బ్యాట్స్‌మెన్.. బౌలర్లు గాయాలతో దూరమైనా ఎటువంటి తడబాటు లేకుండా భారత జట్టు సమర్ధవంతంగా ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. ఆఖరికి అజింక్యా రహానె నేతృత్వంలో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ ను చేజిక్కిచ్చుకుంది. ఆస్ట్రేలియలా పర్యటనలో టీమిండియా జట్టులో కొత్తగా చోటు సంపాదించిన ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించారు. ఐతే ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నాళ్లకు ఆ సిరీస్ గురించి తన మనసులోని అక్కసును వెల్లగక్కాడు. అసలు భారత జట్టు తమ దృష్టిని మళ్లించడం వల్లే ఈ సిరీస్ గెలిచిందని పైన్ అసంబద్ద వాదన తెరపైకి తెచ్చాడు. ఇలా పక్కదారి పట్టించడంలో ఆ జట్టు స్పెషలిస్ట్ అంటూ అవాకులూ చెవాకులూ పేలాడు ఆస్ట్రేలియా కెప్టెన్. అసలు విషయానికి వస్తే ప్రత్యర్థి జట్లను మాటలతో ఏమార్చి, వారిని డిస్ట్రబ్ చేసి మ్యాచ్‌ల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియన్లకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రపంచానికంతటికి తెలుసు.
భారత్ తమ చేష్టలతో మమ్మల్ని పక్కదారి పట్టించింది.. అనవసరమైన విషయాలతో దృష్టి మళ్లించింది.. ఆ సిరీస్ లో చెప్పాలంటే మేం ఓ దశలో వారి వలలో పడిపోయాం.. దీనికి ఉదాహరణగా ఓ విషయం చెబుతాను.. ముందు గాబాలో కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగో టెస్టు కోసం మేం అక్కడికి వెళ్లి ఆడలేమని భారత జట్టు గట్టిగా చెప్పింది.. దీంతో ఆ టెస్టు ఎక్కడ జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో మా జట్టు ఉండిపోయింది.. ఇంతలోనే మనసు మార్చుకుని అక్కడే ఆడతామని టీమిండియా చెప్పింది.. ఇలా మా ఏకాగ్రతను దెబ్బతీయడంతో బంతిపై సరిగా దృష్టి పెట్టలేకపోయాం.. అని టిమ్ పైన్ అర్ధం పర్ధం లేని వాదన వినిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ నీలాపనిందలు సరిపోవన్నట్లు ఆ దేశ మీడియా టీమిండియాపై వ్యతిరేక కథనాలు రాస్తోంది. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ చేసిన ఆరోపణలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు చేసే చీటింగ్‌లో మేమెంత.. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. సిరీస్ ముగిసిన వెంటనే ఈ కామెంట్స్ ఎందుకు చేయలేదని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.