రంగారెడ్డి క్రైం- దేశంలో రోజు రోజుకు క్రైం రేట్ పెరుగుతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, దొంగ తనాలు, దోపిడిలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా నేరాలు, ఘోరాలు మాత్పం ఆగడం లేదు. హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే, మరో మహిళ అత్యాచారానికిగురైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన భార్య, భర్తలు కొద్దికాలం కిందట బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. కరోనా కారణంగా భార్య (39) తన పుట్టినిల్లైన మాడ్గుల మండలం చంద్రాయణపల్లికి వచ్చి ఉంటోంది. హైదరాబాద్ లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోన్న ఆమె ప్రతి రోజూ అక్కడి నుంచి వచ్చి, సాయంత్రం తన సొంత ఊరుకు వెళ్తుండేది. మంగళవారం రోజు మాదిరిగానే ఉదయం ఆ మహిళ నగరానికి పని కోసం వచ్చింది.
తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో ఆమనగల్లులో ఆటో ఎక్కి వస్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ ఎంతకీ ఆమె ఇంటికి మాత్రం చేరుకోలేదు. దీంతో రాత్రి నుంచి ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు చావు వార్త వినాల్సి వచ్చింది. పని కోసం హైదరాబాద్ వెళ్లిన వివాహిత నుచ్చుగుంట తండా సమీపంలో రోడ్డు పక్కన శవమై తేలింది. గుర్తు తెలియని దుర్మార్గులు ఆమెపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారు.
మరి కాసేపట్లో ఇంటికి వస్తున్నానని చెప్పిన ఆమె ఇలా తెల్లారేసరికి శవమై తేలడం సంచలనంగా మారింది. ఆ మహిళ శవానికి సమీపంలోనే ఆమె బట్టలతో పాటు కొన్ని మద్యం సీసాలు పడి ఉన్నాయి. ఇది గుర్తు తెలియని దుర్మార్గుల పనా, లేక వివాహేతర సంబంధమే హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వివాహిత హత్యతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.