నెల్లూరు రూరల్- ఓ బాలుడు అడవిలో తప్పిపోయాడు. ఆ పిల్లాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులు కన్న కొడుకు తప్పిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలోని అరుంధతి వాడకు చెందిన దండు బుజ్జయ్య, వరలక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లు.
బుజ్జయ్య గొర్రెలు కాస్తుండగా, వరలక్ష్మీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. జూలై 1న బుజ్జయ్య గొర్రెలను మేపడం కోసం సమీపంలోని వెలుగొండ అడవిలోకి వెళ్లిపోయాడు. మాములుగా రోజు తండ్రి వెనుక వెళ్లే మూడేళ్ల సంజూ కొద్ది దూరం వెళ్లాక మళ్లీ వెనక్కి వచ్చేవాడు. ఆ రోజు కూడా తన కొడుకు వెనక్కి వెళ్లిపోయాడని అనుకున్నాడు బుజ్జయ్య.
కానీ సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే మాత్రం సంజూ కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా సంజూ దొరకలేదు. గ్రామస్తులంతా అడవిలో గాలించినా బాలుడు ఎక్కడున్నాడో తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజుల పాటు డ్రోన్ల సాయంతో వెతికినప్పటికీ బాలుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో జాగిలాలను రప్పించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక కిడ్నాప్ కోణంలోనూ పోలీసుల విచారణ జరుపుతున్నారు. తండ్రి వెంట వెళ్లి, వెనక్కి వచ్చాక ఎవరైనా బాలున్ని అపహరించారా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కంటి పాప సంజూ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాబు సురక్షితంగా ఇంటికి చేరాలని మనమూ కోరుకుందాం.