ఉత్తర్ ప్రదేశ్- దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా హత్యలు, అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఓ చోటు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో యువతిపై అత్యాచారం చేసిన ఘటన తరువాత చట్టాలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ దుర్మార్గుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఢిల్లీ తరహా అమానుష ఘటన చోటుచేసుకుంది. మరో అత్యాచార దారుణం వెలుగు చూసింది. కదిలే లగ్జరీ బస్సులో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన సుల్తాన్ పూర్ జిల్లాలో జరిగింది. వాహనాల తనిఖీల్లో భాగంగా సుల్తాన్ పూర్ లో ఓ లగ్జరీ బస్సు ఆపి పోలీసులు చెక్ చేయగా అందులో ఇద్దరు బాలికలున్నారు. వారు పరిస్థితి చూసి అనుమానించిన పోలీసులు వారిని విచారించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న డ్రైవరుతో పాటు మరో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని 15 ఏళ్ల మైనర్ బాలిక తెలిపింది.
ఆ బాలికపై ముగ్గురు అతి దారుణంగా అత్యాచారం చేశారని తేలిందని సర్కిల్ పోలీసు అధికారి బాల్ దిరాయ్ రాజారాం చౌదరి చెప్పారు. బాలికకు వైద్యపరీక్షలు జరిపి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. బస్సును సీజ్ చేసి అత్యాచారం కేసులో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా నిందులకు ఉరి శిక్ష వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.