ఫిల్మ్ డెస్క్- కరోనా సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆరోగ్య సూత్రాలు చెబుతున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో పోడ్ కాస్ట్ ఆడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారాయన. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఇలాంటి ఆడియోలు విడుదల చేస్తూ చాలా అంశాలపై తన అభిప్రాయాలను చెప్పారు పూరీ జగన్నాధ్. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన పూరి, ఈ సారి సరికొత్త ఆరోగ్య చిట్కా చెప్పారు. ఇక ఇప్పుడు పూరీ జగన్నధ్ రాజముడి రైస్ గురించి వివరించారు. రాజముడి రైస్ ప్రత్యేకత గురించి విడమరిచి చెప్పారాయన. ఆయన మాటల్లో వింటే.. ఇండియాలో మనందరికీ ముఖ్యమైన ఫుడ్ రైస్. మీరు చాలా రకాల బియ్యం పేర్లు వినే ఉంటారు. బాసుమతి, అన్నపూర్ణ, చంపా, హన్సరాజ్, మొలకొలుకులు, పూస, సోనా మసూరి, జాస్మిన్, సురేఖ.. ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇండియాలో ఒకప్పుడు లక్ష రకాల బియ్యం ఉండేవి. ఒక రకం పండించే రైతు చనిపోతే అదే రకం మళ్లీ దొరికేది కాదు. అలా ఎన్నోరకాలు మాయమైపోయాయి. చివరికి 40 వేల రకాలు మిగిలాయి. గత 50 ఏళ్లలో అవి కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు కేవలం 6 వేల రకాలు మాత్రమే మిగిలాయి. వాటిల్లో ఒకదాని గురించి మీకు చెప్పాలి. దాని పేరు రాజముడి రైస్.
రాజముడి రైస్ కర్ణాటకలో పుట్టింది. అక్కడ పూర్వం రైతులు పన్నులు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఈ రాజముడి రైస్‌తో కట్టేవారు. అంటే అప్పట్లో దానిని కరెన్సీగా భావించేవారు. అంత విలువైన రైస్ ఇది. విజయ్ రామ్, రాంబాబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ రకం గురించి నాకు చెప్పారు. వాళ్లిద్దరూ వ్యవసాయం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు. దీని వల్ల మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్నవారు తప్పకుండా తినాలి. అంతే కాదు ఆడాళ్ళు తప్పకుండా తినాల్సిన రైస్ ఇవి. మంత్లీ పీరియడ్స్ సమయంలో ఆడాళ్లకి హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ఉంటుంది. విపరీతమైన కడుపునొప్పి ఉంటుంది. అవన్నీ దీనితో మాయమైపోతాయి. నాకు తెలిసిన చాలా మంది ఈ రైస్ వాడుతున్నారు. దీన్ని కుక్కర్‌లో పెట్టి వండకూడదు. పాత రోజుల్లో లాగా ఎసరు పెట్టి వండాలి. గంజి వార్చి దాన్ని దాచుకుని.. సాయంత్రం ఆ గంజిని తాగండి. మనం తినే తిండి వల్ల ఎన్నో రోగాలొస్తున్నాయి. కొన్నాళ్లు మీరు తినే తెల్ల బియ్యం పక్కనపెట్టి ఈ రాజముడి రైస్ తినండి. రాజుగారికి ముడిగా చెల్లించిన బియ్యమే రాజముడి రైస్.. అని పూరి జగన్నాధ్ విడమరిచి చెప్పారు. వీలున్నవాళ్లందరు రాజముడి బియ్యాన్ని వాడాలని పూరీ చెబుతున్నారు. సో.. మీకు అందుబాటులో ఉంటే ఓ సారి పూరి జగన్నాధ్ చెప్పిన రాజముడి రైస్ ను ట్రై చేయండి మరి.