చెన్నై రూరల్- తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చెన్నై శివారు ప్రాంతమైన తిరువళ్ళూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఒక్క సారిగా కలకలం రేగింది. అంతవరకు బాగానే ఉన్న వాతావరణం అకస్మాత్తుగా గందరగోళంగా మారింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఉన్నట్లుండి విద్యార్ధుల ఏడవడం మొదలుపెట్టారు. స్కూల్ లో ఏం జరుగుతుందో తెలియక చుట్టు పక్కల ఉన్న వాళ్లు పరుగున పాఠశాలలోనికి పరిగెత్తారు.
తీరా స్కూల్ లోకి వచ్చాక అక్కడ జరుగుతున్నది చూసి అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులంతా ఒక 30 సంవత్సరాల వయసున్న యువకుడిని పట్టుకుని ఏదో బతిమాలుతున్నారు. మరి కొంత మంది విధ్యార్ధులు ఆ యువకుడి కాళ్లు పట్టుకుని వెళ్లకుండా ఆపుతున్నారు. ఇంకొందరు వెళ్లొద్దు ఉంటూ వేడుకుంటున్నారు. విధ్యార్ధులంతా పెద్దగా ఏడుస్తుంటే, ఆ యువకుడు సైతం వారితో కలిసి ఏడుస్తున్నాడు.
వాళ్ల ఏడుపులు విని బయటి నుంచి వచ్చిన వారికి ముందు ఏమీ అర్ధం కాలేదు. కానీ కాసేపయ్యాక మొత్తం విషయం తెలిసింది. అసలేమైందంటే.. చెన్నైలోని తిరువళ్లూరు ప్రభుత్వ పాఠశాలలో జె.భగవాన్ 2014లో ఇంగ్లీషు టీచర్ గా జాయిన్ అయ్యారు. కొద్ది సమయంలోనే ఆయన పిల్లలతో బాగా కలిసిపోయారు. అక్కడ చదివే పిల్లలంతా చాలా వరకు పేదకుటుంబాల నుండి వచ్చినవారే. భగవాన్ జాయిన్ అయినప్పటి నుండీ విధ్యార్ధులతో ఓ స్నేహితుడిగా కలిసిపోయాడు.
అందరితో ఆప్యాయంగా మాట్లాడటం, ఎంతో నేర్పుగా వారికి పాఠాలు చెప్పడం, కొందరికి భవిష్యత్ చదువుల గురించి వివరించడం చేసే వారు. అంతే కాదు పిల్లలుక ఏవైనా పుస్తకాలు కావాల్సినా, నోట్ బుక్స్ కావాల్సినా తన సొంత డబ్బులతో కొనిచ్చేవాడు. దీంతో భగవాన్ ఆ స్కూల్ పిల్లలకు ఎంతో ఇష్టమైన టీచర్ అయ్యాడు. ఇటువంటి క్రమంలో భగవాన్ కి ఆ స్కూల్ నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యింది.
ఇంకేముంది విషయం తెలిసిన పిల్లలు అతనిని వెళ్ళనివ్వకుండా ఏడుస్తూ అడ్డుపడ్డారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు రాష్ట్రమంతా సంచలనంగా మారింది. దీంతో భగవాన్ విషయం రాష్ట్ర విద్యాశాధికారులకు చేరింది. తాత్కాలికంగా 10రోజులు బదిలీ ఆపుతూ ఉత్తర్యులు ఇచ్చిన విద్యాశాఖ, తదుపరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.