నెల్లూరు క్రైం- ఇది కలికాలం.. చిన్న విషయాలకే మనుషుల మధ్య విద్వేషాలు రగులుతున్నాయి. అకారణంగా కోపతాపాలు పెంచుకుని ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. క్షణికావేశంలో విలువైన ప్రాణాలను తీసేస్తున్నారు. ఈ మద్య కాలంలో చిన్నపాటి వివాదాలకే హత్యలు చేసేస్తున్నారు. దీంతో అసలు సమాజం ఎటుపోతుందన్న భయం కలుగుతోంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య చూస్తే నిజంగా ఆందోళన కలుదుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘోరం జరిగింది. కావలి టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కచ్చేరిమిట్ట వద్ద ఉన్న కాలేజీ మైదానంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు యువకులు మద్యం తాగారు. ఈ క్రమంలోనే ఓ బ్యాచ్‌కు చెందిన జమీరుద్దీన్ అనే యువకుడు మరో వర్గం వద్దకు వెళ్లి అగ్గిపెట్టె కావాలని అడిగాడు.
మమ్మల్నే అగ్గిపెట్టె అడుగుతావా అంటూ ఆ వర్గం యువకులు ఫైర్ అయ్యారు. అగ్గిపెట్టే ఎడిగిన జమీరుద్దీన్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో మిగతా వర్గం వారు సైతం రావడంతో మాటా మాటా పెరిగి రెండు వర్గాలు కొట్లాటకు దిగారు.రెండు గ్రూపుల మధ్య చాలాసేపు వాగ్వాదం, సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీరు సీసాతో ఇద్దరు యువకులు జమీర్ గొంతులో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన జమీర్ స్నేహితులు చంద్ర, పృథ్వీలపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కావలి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులైన నిఖిల్, రాహుల్ కోసం గాలిస్తున్నారు.
చనిపోయిన జమీర్ ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అతడి తండ్రి గౌస్‌మొహిద్దీన్ కావలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జమీర్ మృతితో తల్లిదండ్రులు సహా బంధుమిత్రులు పెద్దసంఖ్యలో కావలి ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. చేతికి అందొచ్చిన బిడ్డ ఇక తమను చూసుకుంటాడనుకున్న తల్లిందండ్రులు కన్న కోడుకు మృతితో గుండెలవిసేలా ఏడ్చారు. వారి కన్నీరు అందరిని కదిలించింది. కేవలం క్షణికావేశం ఓ ప్రాణాన్ని తీయగా, ఓ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది.