ఆర్థిక ఇబ్బందులు మనుషుల్ని, బంధాల్ని, బంధుత్వాలను కుంగదీస్తాయి. ఇవే సమస్యలు ప్రాణాల మీదకు తెస్తాయి. జీతం కన్నా ఖర్చులు పెరగడం, వేటిని ఆపలేని పరిస్థితుల్లో అప్పులు చేసి, వాటిలో కూరుకుపోయి.. తీర్చలేక అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు మనుషులను ఆగాధంలోకి నెట్టేస్తాయి. ఆలోచనలను చంపేస్తాయి. బతకాలన్న ఆశల్ని సమాధి చేస్తాయి. ఇవే సమస్యలు కుటుంబాల ఉసురు తీస్తున్నాయి. నేటి సమాజంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఏదీ కొనాలన్నా,ఏదీ తినాలన్నా పూటకు 500 ఖర్చు అయిపోతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చిన జీతాలు చాలక, అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులను తెచ్చుకుంటున్నారు. ఆ అప్పులు తీర్చలేక ప్రాణాలు వదులుతున్నారు. ఇవే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కండక్టర్ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో విషాదం చోటుచేసుకుంది. కండక్టర్ బస్సులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల్లో ఉండగానే ఊపిరి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్‌రెడ్డి (54) 1993లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు విక్రమ్, వినయ్‌లు ఉన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అనారోగ్యంగా ఉందని ఆర్టీసీ డిపోలో లీవ్ పెట్టాడు. సెలవు అయినప్పటికీ..ఆదివారం డిపోకు వచ్చిన ఆయన డ్యూటీ చేస్తానని చెప్పి రిజిస్టర్‌లో పేరు రాయించుకున్నాడు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన బస్సులో తన వెంట తెచ్చుకున్న టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
డ్యూటీ టైమ్ అవుతున్నా కనిపించకపోవడంతో సిబ్బంది ఫోన్ చేస్తే స్పందించలేదు. అయితే బస్సులో ఉరి వేసుకోవడాన్ని కార్మికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. విషయం పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దించి పంచనామ చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతోనే మహేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు అధికారుల ఒత్తిడి వల్లే మహేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.