హైదరాబాద్- తెలంగాణ బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆందోళనలను ఉదృతం చేస్తోంది. గత కొన్ని రోజులుగా పలు అంశాలపై కేసీఆర్ సర్కార్ పై నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్న బీజేపీ, వాటికి మరింత పదును పెడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగిపోయింది.
బండి సంజయ్ కి ఉన్నత న్యాయస్థానంలో బెయిల్ రావడమే ఆలస్యం, రాష్ట్రంలో మళ్లీ ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 317ను పున సమీక్షించాలనే డిమాండ్‌తో ఈ నెల 10వ తేదీన తెలంగాణ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్ విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసింది.
కేసీఆర్ సర్కార్ తెచ్చిన జీవో నెంబర్ 317 కారణంగా టీచర్లు సొంత ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే అవకాశం కోల్పోతున్నారని బీజేపీ చెబుతోంది. ఇక జీవో నెంబర్ 317పై నిరసనలు, ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.
ఈ క్రమంలోనే 317 జీవోపై ఆందోళనలు ఉధృతం చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి మద్దతు ప్రకటించాలని తెలంగాణ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అర్ధం పర్ధం లేకుండా బీజేపీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారని టీఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.