ఉన్నత చదువుల కోసమని ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెడుతున్న ఎంతో మంది తెలుగు విద్యార్థులు అకాల మరణాలకు గురౌతున్నారు. కన్నవారిని కన్నీళ్ల కడలిలో ముంచెత్తుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరూ, గన్ కాల్పుల్లో మరొకరు మృత్యువాత పడిన సంగతి విదితమే. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలాడు.
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎన్నో కలలు. తాము సరిగా చదువుకోలేకపోయినా, తమ బిడ్డల్ని ప్రయోజకులను చేయాలనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడతారు. వారి స్థోమతకు మించి చదివిస్తారు. తమ కష్టాన్ని అర్థం చేసుకుని పిల్లలు కూడా అందుకు సహకరిస్తే.. ఆ తల్లిదండ్రులు మురిసిపోతారు. మనం వెళ్లలేని దేశాలకు మన పిల్లలు వెళ్లి చదువు కుంటున్నారంటే ఊరంతా చెప్పుకుంటారు. అదే చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన పిల్లలు, విగత జీవులుగా తిరిగి వస్తే ఆ కడుపు కోతను ఎవ్వరూ తీర్చలేరు. ఆ వేదన వర్ణనాతీతం. అలా పై చదువుల కోసమని అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెంది..శవమై స్వగ్రామానికి వచ్చాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు నాగసాయి గోపి అరుణ్ కుమార్ (23), కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇంజనీరింగ్ వరకు చదివాడు. ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్తానని చెప్పగా..కుమారుడి కోరికను కాదనలేక ఆస్తులు అన్ని కుదవ పెట్టి పంపారు తల్లిదండ్రులు గత ఆగస్టులో అమెరికాలోని లాంనార్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. టెక్స్‌పోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో అద్దెకుంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మార్చి 1 నుంచి అరుణ్ కుమార్ కనిపించడంలేందంటూ స్నేహితులు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నెల 4వ తేదీన అరుణ్ కుమార్ మృతదేహాన్ని.. అతను ఉండే నివాసానికి సమీపంలో ఉన్న సరస్సులో పోలీసులు గుర్తించారు. అనంతరం మృతుడి స్నేహితులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం అరుణ్ కుమార్ మృతదేహాన్ని, స్నేహితుల సహకారంతో శనివారం మధ్యాహ్నం స్వగ్రామమైన బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి పంపారు. తొలుత ప్రమదమని చెప్పి, ఆత్మహత్య చేసుకున్నాడని మరోసారి చెప్పారు. చేతికి వచ్చిన బిడ్డ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి.. అర్థాంతరంగా తనువు చాలించాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.