మెగాస్టార్ చిరంజీవి… తెలుగు సినీ పరిశ్రమలో ఈ మాటకి పరిచయం అవసరం లేదు. వందల సినిమాలు. వేల కొద్దీ అభిమాన సంఘాలు, లక్షల కొద్దీ అభిమానులు. కోట్ల కొద్దీ కలెక్షన్ లు. ఓ హీరో స్థానాన్ని, స్థాయిని లెక్క కట్టాలంటే మాములుగా ఇవన్నీ సరిపోతాయి. కానీ.., చిరంజీవి అంటే ఇవి మాత్రమే కాదు. మెగాస్టార్ అంటే ఓ మంచు కొండ. ఆయన వ్యక్తిత్వం ఓ శిఖరం. అభిమానుల చేత కటౌట్స్ పెట్టించుకుని మురిసిపోయే హీరోల నడుమ.., వారి చేత రక్తదానాలు చేపిస్తున్న ఓ మహోన్నత వ్యక్తి మెగాస్టార్. ఐ బ్యాంక్ స్థాపించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మహర్షి ఆయన. నిజానికి 1997లోనే చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయ్యింది. ఈ 24 ఏళ్ళ కాలంలో వీటి ద్వారా ఎంత మందికి ఆయన ఊపిరులు ఊది ఉంటారు? ఎంత మంది ఇళ్లల్లో ఆనందానికి కారణం అయ్యుంటారు? ఈ లెక్కలు కడితే.., 10 మంది సోనూసూద్ లతో మన మెగాస్టార్ సమానం. కానీ.., తెలుగు మీడియాలో ఆ లెక్కలు కట్టే వారు ఏరి? మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు మీడియా పెద్దలకి ఓ కడుపు మంట. ఒక్కడై వచ్చి.., తన పునాదిరాళ్ళని గట్టిగా ఏర్పాటు చేసుకుని.., విజేతగా నిలిచి.., ఈనాడు తెలుగు సినీ తోటలో ఓ మెగా కాంపౌండ్ నే నిర్మించే స్థాయికి ఎదిగాడు ఆయన. అందుకే వారందరికీ చిరంజీవి అంటే ఈర్ష్య, భయం, ఆందోళన. కాబట్టే.., చిరంజీవి ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా మన సో కాల్డ్ మీడియాకి కనిపించదు, వినిపించదు. ఆయన్ని విమర్శించడానికి 70 ఎమ్.ఎమ్ లో లేచే నోర్లు.. చేసే మంచిని ప్రశంసించాల్సి వస్తే మాత్రం మౌనంగా ఉండిపోతాయి.
ఇక కరోనా విషయానికే వద్దాం. కరోనా కష్ట కాలంలో సోనూసూద్ చేసిన మంచి పనులను పొరపాటున కూడా తక్కువ చేసి చెప్పడానికి వీలు లేదు. వలస కార్మికుల విషయంలో గాని, పేద ప్రజల అవసరాలు తీర్చే విషయంలో గాని, ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు విషయంలో గాని సోనూసూద్ చేసిన మంచి దేశ ప్రజలందరికీ ఆదర్శం. కానీ.., చిరంజీవిని టార్గెట్ చేసే వారికి మాత్రం చిరుని తిట్టడానికి సోనూసూద్ ఓ ఆయుధం అయ్యాడు. వారంతా సోనూసూద్ ని ఆకాశానికి ఎత్తేస్తూ.., చిరంజీవి మాత్రం ఇంట్లో దోశెలు వేస్తున్నాడు అంటూ వార్తలు వండి వార్చడం మొదలు పెట్టారు. కానీ.., అప్పటికే చిరు వేల మంది సినీ కార్మకులకి అండగా నిలుస్తూ వచ్చారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా ఆదుకుంటుంది చిరంజీవే. కానీ.., ఈ వార్తలు మాత్రం వారు ప్రచురించరు. కరోనా క్రైసిస్ చారిటీకి కోటి రూపాయలు వరకు డొనేట్ చేశారు. అయినా వారికి చిరంజీవి గొప్పదనం అర్ధం కాలేదు. ఒక్క సోనూసూద్ మాత్రమే కాదు.., ఎవరు, ఎక్కడ, ఎలాంటి మంచి పని చేసినా.., మరి మీ మెగాస్టార్ ఏమి చేశాడు అంటూ పోలిక తెస్తూ వచ్చారు. ఇదంతా కావాలని ఆయన్ని టార్గెట్ చేయడానికి చేసిన కార్యక్రమాలే. ఈ ఒత్తిడి కారణంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా కాస్త సైలెంట్ అయిపోయే వాతావరణాన్ని సృష్టించేశారు.
కానీ.., అలా మౌనంగా ఉండిపోతే ఆయన చిరంజీవి ఎందుకు అవుతాడు. సరిగ్గా.., ఇలాంటి సమయంలో ఆక్సీజన్ బ్యాంకులతో ముందుకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా సమయంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో.. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వీటిని ఏర్పాటు కూడా చేశారు. దీనికి సంబంధించిన పనులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. మొత్తం ఈ మెగా ప్రాజెక్ట్ ఖర్చు రూ.35 కోట్ల పై మాటే. మరి ఈ సహాయాన్ని ఎలా చూడాలి? ఇది ఎవరి దగ్గర విరాళాలు వసూలు చేసి తెచ్చిన డబ్బు కాదు. మన “ముఠామేస్త్రి” తన రక్తాన్ని స్వేదంగా మార్చి సంపాదించిన డబ్బు. ఇపుడు ఇంత మంచి పని చేస్తున్నా.., మన మీడియా మేధావుల్లో అదే రకమైన మౌనం. ఒకవేళ ఇదే పని కనుక సోనూసూద్ చేస్తే హీరో అనేస్తారు? మరి మెగాస్టార్ విషయంలో ఎందుకు ఈ మౌనం. ఈ అందరివాడి గురించి మంచిగా రాయడానికి మీ కలాలు కదలడం లేదా? లేదా కులాల క్యాలిక్యులేషన్స్ అడ్డం వస్తున్నాయా?
నిజానికి తెలుగు మీడియా చిరంజీవి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. ఆయన కుటుంబ విషయాలు వీరికి బ్రేకింగ్ న్యూస్ లు. మెగా హీరోలని నోరేసుకుని తిట్టేవారు వీరు ద్రుష్టిలో మేధావులు. వారిని స్టూడియాల్లో గంటలు గంటలు కూర్చోబెట్టి డిబేట్స్ కూడా నిర్వహిస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ మీడియా వర్గాలు అన్నీ కలసి చిరంజీవిని ఎన్ని విధాలుగా టార్గెట్ చేశాయో అందరికీ తెలిసిన విషయమే. అయినా.., మెగాస్టార్ మాత్రం ఈ విషయంలో ఒక్కసారి కూడా నోరు తెరిచింది లేదు. ఇప్పుడు కూడా కరోనా సహాయం విషయంలో మెగాస్టార్ ని జీరో చేయాలన్నదే వారి ప్లాన్. కానీ.., ఈ కాలంలో అలాంటి పప్పులు ఉడకవు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రజలకి అందుబాటులో ఉంది. ఎవరు మంచి చేసినా, ఎవరు చెడు చేసినా ప్రజలకి ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకే మీడియా గుర్తించని చిరు పెద్ద మనసుని ప్రజలు గుర్తించారు. కష్టకాలంలో “ఆపద్బాంధవుడు”లా ప్రజలని ఆదుకుంటున్న మెగాస్టార్ ని రియల్ హీరో అని కీర్తిస్తున్నారు.
చివరగా ఒక్క ప్రశ్న. రెండు తెలుగు రాష్ట్రాలలో కలపి మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మంత్రులు, ఎంపీలు చాలా మందే ఉన్నారు. వీరిలో ఎంత మంది తమ జేబులో నుండి డబ్బులు బయటకి తీసి.., కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. ఇంత మంది ప్రజా ప్రతినిధులను వదిలేసి ఒక్క చిరంజీవిని మాత్రమే ప్రతిసారి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేయాల్సిన మంచి గత 25 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నారు. భవిష్యత్ లో కూడా చేస్తారు. ఇక్కడ ఎవ్వరూ తాతకి దగ్గు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా విమర్శలు మాని.., మెగాస్టార్ చేస్తున్న మంచిని గుర్తిస్తారని ఆశిద్దాం. మరి.., ఈ విషయంలో మీ అభిప్రయావులను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.