హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. పవన్ సీరియస్ కామెంట్స్ తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా పరిశ్రమగా మారుతోంది వ్యవహారం.
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన మీద ఉన్న కోపంతో జగన్ సర్కార్ సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతోందంటూ ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీతో పెట్టుకుంటే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పవన్ కశ్యాణ్ వ్యాఖ్యలను చాలా మంది సినీ ప్రముఖులు సమర్ధంచారు. ఆయనకు మద్దతుగా కొంత మంది ట్వీట్లు కూడా చేస్తున్నారు.
పవన్ కళ్యామ్ వ్యవహారంపై తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పంధించింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. కొంత మంది తమ అభిప్రాయాలను, ఆక్రోశాన్ని వెల్లడించారని, అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని ఆ నోటీసులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెల్లడించిన అభిప్రాయాలను ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయాలుగా పరిగణించకూడదని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే రెండు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి అని విధాలుగా సహకారం అందుతోందని నోటీసులో స్పష్టం చేశారు. ప్రభుత్వాల సహకారం లేకుండా మేం మనుగడ సాగించలేం అని పేర్కొన్నారు. సినీ పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయని, ఈ సమయంలో మాకు రెండు ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇండస్ట్రీకి రెండు కళ్లు వంటి వారని, సినీ ఇండస్ట్రీకి వారి ఆశీస్సులు, మద్దతును కోరుకుంటున్నామని నోటీసుల్లో పేర్కొన్నారు.