రాష్ట్రంలో కరోనా వైరస్ వాహకులుగా భావిస్తున్న సూపర్ స్ర్పెడర్లకు ఈ నెల 28 నుంచి టీకాలివ్వాలని సర్కారు నిర్ణయించింది. తొలుత హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే వ్యవఽధి 84 రోజులకు పెంచారు. దీంతో ఉన్న కొవిషీల్డ్ డోసులన్నింటినీ సూపర్ స్ర్పెడర్లకే వేయాలని సర్కారు భావిస్తోంది. ఈలోగా కేంద్రం పంపే డోసులతో పాటు సొంతంగా సేకరించేవి సరిపోతాయని అంచనా వేస్తోంది. మార్కెట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సిన్ చేయాలని హరీశ్ అధికారులను ఆదేశించారు. సూపర్ స్ర్పెడర్ల గుర్తింపు, ఇతర ఏర్పాట్లపై ఈ సమీక్షలో చర్చించారు. ఇందుకు అవసరమైన వసతులు, టీకాలను సమకూర్చుకోవాలనీ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభిస్తారు. తర్వాత వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర కార్పొరేషన్లకు విస్తరించనున్నారు. ఎప్పుడు ప్రారంభించేది కచ్చితంగా నిర్ణయించకపోయినా వైద్యవర్గాల సమాచారం మేరకు ఈ నెల 28 నుంచి ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
గ్రేటర్ పరిధిలో కోటి మంది జనాభా ఉంటారు. సాధారణ రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి రోజుకు 6-8 లక్షల మంది నగరానికి వచ్చి వెళ్తుంటారు. ఇలా బయట నుంచి వచ్చేవారంతా ఎక్కువగా ఆటోలనే ఆశ్రయిస్తుంటారు. అలాగే నగరవాసులు కూడా చాలామంది ఆటోలే ఎక్కుతుంటారు. వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచే వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారి వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి సేకరించనుంది. ఇలా అన్ని విభాగాలకు చెందిన వారి వివరాలను సేకరించి టీకాలు ఇవ్వనున్నారు. డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ సిబ్బంది, రేషన్ డీలర్లు, కిరాణ షాపు వారు, పెట్రోల్ బంకు సిబ్బంది, వీధి వ్యాపారులు, రైతుబజార్లలోని విక్రేతలు, పూలు, పండ్ల మార్కెట్, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్లో విక్రేతలు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆన్‌లైన్ వస్తువులు డెలివరీ చేసేవారితో పాటు మరికొందరు ఉన్నారు.