కరీంనగర్- రాజకీయ నాయకలు జాగ్రత్తగా మాట్లాడాలి. మరీ ముఖ్యంగా ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. కానీ కొంత మంది రాజకీయ నాయకులు ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాల్టాడి చిక్కుల్లో పడతారు. తెలంగాణలో మహిళా అధికారిపై అనుచిత వ్యఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహారం మరిచిపోకముందే మరో తెలంగాణ మంత్రి నోరు జారి నవ్వులపాలయ్యారు.
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మాట తడబడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు బదులు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేరు అనేశారు. దీంతో కాసేపు ఆయన ఏమాట్లాడుతున్నారో ఎవరికి అర్ధం కాలేదు. కరీంనగర్ జిల్లాలో శనివారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్రంలో పెన్షన్ల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. చివరలో ఇంత మంచి పథకాలు ఇచ్చిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా వద్దా, కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు. కేసీఆర్ కు బదులు చంద్రబాబు పేరు చెప్పేసరికి అక్కడున్నవారికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతలో తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న గంగుల కమలాకర్, కేసీఆర్ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇంకేముంది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పేరు లేకుండా తెలంగాణ, ఆంధ్రాలో పాలిటిక్స్ లేవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.