హైదరాబాద్- ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వృధ్యాప్య పెన్షన్ల అర్హత నిబంధనల్లో మార్పులు చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పటి వరకు 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వృధ్యాప్య పెన్షన్ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఐతే గత ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన వారందరికి పెన్షన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో 57 ఏళ్ల నిండిన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేసీఆర్ 36 నెంబర్ జీవోను బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం 65 ఏళ్ల వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక నుంచి 57 ఏండ్లు నిండిన వారందరూ ఆసరా పెన్షన్లకు అర్హులని, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, వయస్సు నిర్ధారణ పత్రాలతో ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆసరా పెన్షన్లకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తీనియా జారీ చేశారు. ఈ నిర్ణయంతో కొత్తగా లక్షలాది మందికి ప్రతినెలా 2016 రూపాయల వృద్ధాప్య పెన్షన్ అందనుంది. వృద్ధాప్య పెన్షన్ల కు వయోపరిమితిని తగ్గిస్తూ జీఓ జారీ చేసినందుకు పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.