హైదరాబాద్-వరంగల్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు వరంగల్ లో పర్యటించనున్నారు. పట్టణంలోని మహాత్మాగాంధీ సెమోరియల్ ఆస్పత్రిని ఈయన సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వార బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసానికి వెళ్తారు ముఖ్యమంత్రి. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు సెంట్రల్ జైలుకు చేరుకుంటారు. జైలు అధికారులతో చర్చించిన తర్వాత తిరిగి మధ్యాహ్న భోజనం కోసం లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి కరోనా రోగులను పరామర్శిస్తారు.
ఎంజీఎం ఆస్పత్రిలో సూపరింటెండెంట్, వైద్యులు, ఇతర సిబ్బందితో సీఎం మాట్లాడతారు. తిరిగి 3 గంటలకు ఎంపీ లక్ష్మీకాంతారావు నివాసానికి వెళ్లనున్నారు. అక్కడే అధికారులు, నాయకులతో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. సమావేశం తరువాత హన్మకొండ నుంచి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ కు వచ్చేస్తారు కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రికి వెళ్లి కరోనా రోగులను పరామర్శించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఎంజీఎం ఆస్పత్రిలోనూ కరోనా రోగులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. కరోనా రోగులకు చికిత్స అందించడంలో ఎంజీఎం ఆస్పత్రి విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తడం, కొవిడ్ రోగులకు సరైన వైద్య సహాయం అందడం లేదన్న ఆరోపణలు రావడంతో సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని బదిలీ చేశారు.
ఆయన స్థానంలో చంద్రశేఖర్‌ను సూపరింటెండెంట్‌గా నియమించారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆస్పత్రిని వెళ్తుండటం ప్రధాన్యతను సంతరించుకున్నది. ఎంజీఎం ఆస్పత్రి, కాకతీయ వైద్య కళాశాల మధ్యలో ఉన్న కేంద్ర కారాగారాన్ని వరంగల్ నగర శివారు ప్రాంతంలోకి తరలించాలని గతంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అనువైన స్థలం కోసం సెంట్రల్ జైలు అధికారులు పలు చోట్ల పరిశీలించారు. వరంగల్ శివారు ప్రాంతంలోని ధర్మసాగర్, బొల్లికుంట, మామునూరు ప్రాంతాల్లో స్థల సేకరణకు పయత్నించారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మార్చడంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.