హైదరాబాద్- కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు.. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదు.. కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాన మంత్రి.. బీజేపీ మత పిచ్చి పార్టీ.. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సిగ్గు, శరం లేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై వాడిన పరుషపదజాలం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని చెప్పారు. బీజేపీకి సిగ్గు, శరం లేదు అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
కేంద్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమన్నారంటే.. అందరికీ ఇల్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా.. ఆలు క్రిప్టో కరెన్సీని అధికారికంగా గుర్తించకుండా 30 శాతం పన్ను ఎలా విధిస్తారు.. నదుల అనుసంధానం విషయంలో అసలు ఎవరినైనా సంప్రదించారా.. రైతులకి, చేనేత కార్మికులకు, కర్షకులకు ఈ బడ్జెట్ కారణంగా వచ్చిన లాభం ఏమిటి.. ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తాము అన్నారు కదా.. నల్లధనం వెనక్కి తెస్తామన్నారు కదా.. ఆ మాటలు, వాగ్దానాలు ఏమైనాయి.. బడ్జెట్ లో మహాభారత శ్లోకాలను చదివి మరీ అన్నీ అబద్దాలు చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఉద్యమిస్తాను.. బీజేపీని కూకటి వేర్లతో సహా ప్రకలించి బంగాళాఖాతంలో కలపాలి.. అంటూ కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
ఇక దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం చాలా ఘోరంగా వంచించిందని కేసీఆర్ మండిపడ్డారు. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా.. పేదప్రజలకైతే పెద్ద గుండు సున్నా అని అన్నారు. వాళ్లు చెప్పే లెక్కలు వేరే.. నిజాలు వేరే.. ఎస్సీ, ఎస్టీలు 30 కోట్ల జనాభా అట.. చాలా పెరిగిపోయింది.. ఎస్సీ, ఎస్టీల జనాభా తన లెక్కల ప్రకారం 35 నుంచి 40 వేల కోట్లు.. వారికి భారత ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది కేవలం 12,500 కోట్లు. ఇంతకంటే దరిద్రం మరోటి ఉండదు.. మన రాష్ట్రంలో ఖర్చు చేస్తోంది 33,611 కోట్లు, ఇవి నా ఆరోపణలు కాదు.. భారత ప్రభుత్యం చెప్పిన గణాంకాలే అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదన్న కేసీఆర్, వెరీ బ్యాడ్ పవర్ పాలసీ అవలంభిస్తున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణలంటే వ్యవసాయ రంగానికి మీటర్లు పెట్టాలి.. రైతుల ముక్కు పిండి చార్జీలు వసూలు చేయాలి.. కేంద్రంలో మెదడు లేని ప్రభుత్వముందని అన్నారు. చాలా ఘోరమైన పద్ధతుల్లో ఈ దేశాన్ని నాశనం చేస్తోంది ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. ఈ గొప్పోడు వచ్చిండు గుజరాత్ నుంచి అంటూ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
గుజరాత్‌లో ఏదో పొడిచేసినట్లు దొంగ సోషల్ మీడియా ప్రచారాలతో గద్దెనెక్కారని ఎద్దేవా చేశారు. కేంద్రం దిక్కుమాలిన బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమైతే ఈ ప్రభుత్వం దరిద్రపుగొట్టు ప్రభుత్వం.. పవిత్రమైన గంగానదిలో శవాలు పారాయి.. లాక్‌డౌన్‌తో కాలినడకన పోతూ వేలాది మంది హైవేల మీద చనిపోయారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేసీఆర్.