ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అయితే తాలిబన్లు అనగానే కర్కశహృదయులు ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి మూవీలో కాలకేయులను తలపించేవారని అంటారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్‌షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొన్నటి వరకు పంజ్‌షేర్ తాలిబన్లను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.
ఆనాటి నుంచి ఓ వైపు చర్చలు.. మరోవైపు యుద్దం చేస్తూ వస్తు వస్తున్నారు.. మొత్తానికి పంజ్‌షేర్ కూడా తమ వశమైందని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనందోత్సాహాలతో తాలిబన్లు నిన్న రాత్రి కాబూల్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున గాలిలోకి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తాలిబన్లు సంతోషం పట్టలేక జరిపిన కాల్పుల్లో చనిపోయిన 17 మంది మృతదేహాలతోపాటు గాయపడిన 41 మంది తమ ఆసుపత్రిలో చేరినట్టు కాబూల్‌లోని ఎమర్జెన్సీ ఆసుపత్రి తెలిపింది. వీరంతా నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన వారని పేర్కొంది.
కాగా, కాల్పుల్లో గాయపడిన తమ వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తున్న వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పంజ్‌షేర్ లోయను కూడా ఆక్రమించామన్న తాలిబన్ల ప్రకటనను నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఖండించాయి. పంజ్‌షేర్‌పై దాడికి దిగిన తాలిబన్ దళాలపై నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. ఈ పోరులో తాలిబన్లకు భారీ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏది ఏమైనా తాలిబన్లు తమ నిజస్వరూపాన్ని చూపిస్తున్నారని.. ఆనందమైనా, ఆవేశమైనా తూటాలకు పని చెప్పాల్సిందే అన్న రీతిలో వీరి దురాఘతం కొనసాగుతుందని బాధితులు తెలుపుతున్నారు.