కాందహార్- అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు, అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా తన సైన్యాన్ని ఆఫ్గాన్ నుంచి విరమించుకున్నాక, తాలిబన్లు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అఫ్గనిస్థాన్ లోని తాలినబన్ల ప్రభుత్వానికి సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా నేతృత్వం వహిస్తున్నాడు. ఐతే అఫ్గాన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమార్ రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హైబతుల్లా అఖుండ్ ప్రపంచానికి కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఇటువంటి సమయంలో తమ నేత అఖుండ్ జాదా ప్రజల మధ్యకు వచ్చారని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ల మద్దతుదారులను ఉద్దేశించి అఖుండ్ జాదా ప్రసంగించారని తాలిబన్ వర్గాలు ఆదివారం తెలిపాయి. కాందహార్ లోని దారుల్ ఉలుం హకిమా మదర్సాలో శనివారం ఆయన మాట్లాడారని వారు చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన అక్కడకు చేరుకుని, తాలిబన్లను ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు. ఐతే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం తాలిబన్లు విడుదల చేయలేదు.
అఖుండ్ జాదా ప్రసంగంలోని 10 నిమిషాల నిడివి గల కొంత భాగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు తాలిబన్ల ప్రతినిధులు. కేవలం తాలిబన్ల నాయకత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని, సవాళ్లు ఎదుర్కొంటున్న అఫ్గన్ కు విజయం వరించాలని మాత్రమే అఖుండ్ జాదా ప్రార్థించినట్లు సమాచారం. ఆయన మాటల్లో ఎక్కడా రాజకీయాలు, తాలిబన్ల ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు లేవని అంతర్జాతీయ మీడియా పేర్కొంది
అఫ్గనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినా వారి అధినేత హైబతుల్లా అఖుండ్ జాదా మాత్రం అజ్ఞాతం వీడలేదు. ఇంతకు ముందు కూడా ఆయన ఎలా ఉంటారన్నది ఎవరికి తెలియదు. తాలిబన్లు ఆ మధ్య ఆయన ఫోటోలను విడుదల చేసేవరకు అఖుండ్ రూపురేఖలు కూడా బయటి ప్రపంచానికి తెలియవంటే ఆశ్చర్యమే మరి. తమ నాయకుడు అఖుండ్ జాదా ముందు నుంచీ కాందహార్ లోనే ఉంటున్నాడనీ, త్వరలోనే ప్రజల్లోకి వస్తాడని తాలిబన్ ప్రతినిధి తెెలిపాడు.