ఒకప్పుడు ఓ వ్యక్తి ఏళ్ల తరబడి ఆఫీసులో గానీ, ఎవరి వద్దనైనా గాని పనిచేస్తుంటే సదరు వ్యక్తిపై నమ్మకం ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేసిన.. తిన్న ఇంటికి కన్నం వేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. నమ్మకంగా ఉండి అదును చూసి అందిన కాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి 12 ఏళ్లుగా ఓ పోస్టాఫీస్ లో పనిచేస్తు అందరి వద్ద మంచి వాడిగా నటించి.. అదను చూసి.. రూ.33 లక్షల రూపాయలను తస్కరించి ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం…ఈ నెల 13న అర్ధరాత్రి హైదరాబాద్ BHELలోని సబ్ పోస్టాఫీస్ లో అగ్నిప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అనంతరం పోస్టాఫీస్ లోపల లాకర్ల గ్రిల్స్ తొలగించి ఉండటం గమనించారు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోస్టుమాస్టర్ చౌహన్ శంకర్ ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఓ ఆసక్తికరమైన విషయం పోలీసులకు తెలిసింది. పోస్టాఫీస్ లో 12 ఏళ్లుగా స్వీపర్ గా పనిచేస్తున్న జహీర్(25) చోరీ జరిగిన రోజు నుంచి విధులకు రాలేదు.
అతడు గోవాకు వెళ్లి మూడు రోజులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అతను నగరానికి తిరిగి రాగానే అదుపులోకి తీసుకుని విచారించాగా నేరం అంగీకరించాడు. నగదు ఎక్కువ డిపాజిట్ అయిన రోజు రాత్రి వాచ్ మెన్ లేడనుకొని నిర్ధారించుకొని ఈ చోరీ చేశాడు. మొత్తం రూ.33 లక్షలు చోరీ కాగా నిందితుడి నుంచి రూ.28.5 లక్షల నగదు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ లో చూసి దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ కేసు విచారణలో మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.