తెలుగు చిత్ర సీమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ . దాదాపుగా 350పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన నటనలో తనకెవరూ సాటిలేరని నిరూపించారు. అలా వెండితెరపై సూపర్ స్టార్ గా ఎదిగి ఎంతో మంది అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న కృష్ణ.. ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. అయితే అంతకు ముందు రోజైన 14న కృష్ణ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇక సెలవు అంటూ అందనంత తీరానికి వెళ్లిపోయారు. ఇక ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించిన కృష్ణ.. లేరు, ఇక రారు అనే వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక మరీ ముఖ్యంగా కుమారుడు మహేష్ బాబు తండ్రి మరణించంతో తట్టుకోలేకపోయాడు. ఈ మధ్యకాలంలోనే తన తల్లి మరణం నుంచి తేలుకోకముందే తండ్రి మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇదిలా ఉంటే కృష్ణ మరణ అనంతరం ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో పెద్ద కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిష్ణ సోదరుడు శేషగిరిరావు మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
అన్నయ్యతో నాకు 70 ఏళ్ల అనుబంధం ఉందని, కానీ ఆయన మరణంతో ఇప్పుడు అంతా చీకటి మాయమైందని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మా చిన్న వయసులో అన్నయ్య నన్ను సైకిల్ పై సినిమాకు తీసుకెళ్లేవారంటూ ఆయన చిన్ననాటి మధురమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇక సినిమాల లెక్కల విషయంలో అన్నయ్యకు మంచి పట్టు ఉండేదని తెలిపారు. ఆ మూవీ ఎందుకు ఆడలేదు? ఆడకపోవడానికి కారణాలు కూడా అప్పుడే చెప్పేవారని అన్నారు. ఇక ఇదే కాకుండా అన్నయ్య స్మారక మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనలు కూడా ఉన్నాయని శేషగిరి రావు అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.