ప్రముఖ సీనియర్ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఆదివారం క్షీణించింది. దీంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సల అనంతరం కృష్ణ ఆరోగ్యం కుదుట పడినట్లు తెలుస్తోంది. అయితే, కృష్ణ అనారోగ్యానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. కాగా, తెలుగు చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు కృష్ణ.
కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు. నిర్మాతగా కూడా ఎన్నో హిట్టు చిత్రాలను తీశారు. గత కొంత కాలంగా వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి విజయ నిర్మల మరణంతో తీవ్రంగా కృంగిపోయారు. ఆ బాధనుంచి కోలుకోకముందే మొదటి భార్య ఇందిరా దేవి కూడా కాలం చేశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఇందిరా దేవి మరణం తర్వాతినుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం.