సుదీర్ఘ కాలంలో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ కు వెన్నెముకలా నిలుస్లున్న సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
భారత సెలెక్షన్ కమిటీ నిర్ణయాలు తనను విస్మయానికి గురిచేస్తున్నాయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ తో పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా.. ప్రధాన ఆటగాళ్లనే కొనసాగించడాన్ని సన్నీ తప్పుపట్టాడు. చాన్నాళ్లుగా చూస్తున్నట్లు రోహిత్, విరాట్ మంచి స్కోర్లు చేశారని.. అయినా ఈ సిరీస్ తో జరిగిన లాభమేమీ లేదని వెల్లడించాడు. వారిని పక్కన పెట్టి కొత్త వాళ్లను ప్రయత్నించే దిశగా.. సెలెక్షన్ కమిటీ ఎందుకు ఆలోచించ లేకపోతోందని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన 2 మ్యాచ్ ల సిరీస్ ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 1-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. రెండో మ్యాచ్ లో భారత జట్టు విజయానికి చేరువైనా.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యపడలేదు. ఫలితంగా మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
ఎప్పట్లాగే ఈ సిరీస్ లోనూ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీగా పరుగులు చేశారు. మూడు ఇన్నింగ్స్ ల్లో కలిపి రోహిత్ 240 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 2 అర్ధశతకాలు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 197 పరుగులు చేశాడు. భారత్ తరఫు నుంచి వీరిద్దరూ వరుసగా ద్వితీయ, త్రుతీయ స్థానాల్లో నిలిచారు.ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 266 పరుగులతో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
‘ఎప్పట్లాగే రోహిత్, కోహ్లీ చక్కగా పరుగులు చేశారు. కానీ దీని వల్ల ఒరిగిందేంటి.. ఇంతకంటే మంచి ప్రత్యామ్నాయాలు లేవని అనుకోవాలా. అంతగా ప్రాధాన్యత లేని విండీస్ సిరీస్ కు ఈ ఇద్దరినీ పక్కనపెట్టి.. కొత్తవాళ్లను ఎందుకు ట్రై చేయలేదో? యువ ఆటగాళ్లు ఎలా ఆడుతారు? వారు అంతర్జాతీయ క్రికెట్ లోని ఒత్తిడిని తట్టుకోగలరా అనేది తెలిసేదిగా’ అని సన్నీ ఒక పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన సమయంలో మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను పరిగణలోకి తీసుకుపోవడంపైనా.. గతంలో సన్నీ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా భారత మాజీ పేసర్ అజిత్ అగార్కక్ ఎంపికైన నేపథ్యంలో ఇక మీదటన్నా జట్టు ఎంపికలో మార్పులు వస్తాయేమోనని సన్నీ ఆశాభావం వ్యక్తం చేశాడు.