ఫిల్మ్ డెస్క్- సినిమా స్టుడియోలకు వెళ్లాల్సిన హీరోలు, నిర్మాతలు ఈ మధ్య కోర్టులకు వెళ్తున్నారు. మొన్న మధ్య టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుడు తాజాగా మరో హీరో, నిర్మాత చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కారు. వాళ్లిద్దరు అక్కినేని కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ అంశం సంచలనంగా మారింది.
అవును చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, సుప్రియలు గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. నరుడా డోనరుడా సినిమాకు సంబంధించి తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందని ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు మార్కాపురం కోర్టులో కోర్టులో కేసు వేశారు.
2016లో వచ్చిన నరుడా డోనరుడా ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించగా, సుప్రియ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకు కారుమంచి శ్రీనివాసరావు ఫైనాన్స్ అందించారు. ఈ వ్యవహారంలోనే తనను మోసం చేశారని మార్కాపురం కోర్టులో శ్రీనివాసరావు కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం హీరో సుమంత్, సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.
హీరో సుమంత్ మార్కాపురం కోర్టుకు రావడంతో ఆయనను చూసేందుకు జనం తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా అక్కినేని కుటుంబానికి చెందిన సుమంత్, సుప్రియ చెక్ బౌన్స్ కేసులో కోర్టు మెట్లెక్కడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.