బిజినెస్ డెస్క్- వరుసగా రెండు రోజులు లాభాలతో ట్రేడ్ అయిన సెన్సెక్స్ మళ్లీ నష్టాల బాట పట్టింది. ఈ వారంలో రెండు రోజుల పాటు 50 వేల పైకి దూసుకెళ్లిన సెన్సెక్స్ ఈ రోజు బుధవారం మైనస్ లోకి వెళ్లి మళ్లీ 50 వేల దిగువకు పడిపోయింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో ప్రతికూలంగా మొదలైన సూచీలు కాసేపు లాభాల్లోకి వెళ్లి తిరిగి వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 50,088 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన సెన్సెక్స్ చివరకు 290 పాయింట్ల నష్టంతో 49,902 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనించింది. ఉదయం ట్రేడింగ్ సమయంలో 15,058 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద ముగిసింది.
సిప్లా, సన్ ఫార్మా, యూపీఎల్, కోల్ ఇండియా లాభాలను ఆర్జించగా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక రంగాలకు సంబందించిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద ఉంది. అలాగే గత రెండు రోజుల లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. గురువారం కూడా కొంత ప్రతికూలత ఉండే అవకాశం ఉందని ట్రేడింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.