ఫిల్మ్ డెస్క్- కరోనా నేపధ్యంలో గత యేడాదిన్నర నుంచి సినిమాల కంటే టీవీలదే హవా అని చెప్పవచ్చు. ఎందుకంటే లాక్ డౌనే పరిస్థితుల్లో ఇళ్లకే పరిమితం అయిన జనం టీవీలకు అతుక్కుపోయారు. దీంతో బుల్లి తెర పరిశ్రమ బాగా పుంజుకుంది. సరికొత్త కార్యక్రమాలతో ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు టీవీ ఛానల్స్ లో స్టార్ మా టీవీ ముందంజలో ఉందని దాని రేటింగ్స్ చెబుతున్నాయి. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా మధ్యే ఎక్కువ పోటీ నెలకొంది. ఇక కొత్త సినిమాల విషయంలో అయితే జీ తెలుగు స్టార్ మా మధ్యే పోటీ నెలకొంది. సినిమాలకు భారీ రేట్లు పెట్టి మరీ హక్కులను చేజిక్కించుకుంటున్నాయి స్టార్ మా, జీ టీవీలు.
స్టార్ మా ఇప్పుడు మంచి ఫాంలో ఉండటంతో, తెలుగులోని బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసేసుకుంది. తాజాగా వాటికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ప్రసారం చేస్తోంది. స్టార్ మా ప్రసారం చేయబోయే సినిమాల్లో ప్యాన్ ఇండియన్ చిత్రాలు సైతం ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఆర్ఆర్ఆర్ ఉంది. అంతే కాదు అల్లు అర్జున్ పుష్ప వంటి సినిమాల సాటిలైట్ హక్కులను కూడా తాము దక్కించుకున్నామని స్టార్ మా ప్రకటించింది. ఇక స్టార్ మా ప్రసారం చేయబోయే సినిమాల్లో బాలకృష్ణ అఖండ, నాని టక్ జగదీశ్, రవితేజ ఖిలాడీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సినిమాలు చాలా ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు ఈ ఏడాదే థియేటర్లో వచ్చేందుకు రేడీ అవుతున్నాయి. మహేశ్ బాబు సర్కారు వారి పాట మాత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని టక్ జగదీశ్ మాత్రమే షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. అఖండ, ఖిలాడీ వంటి సినిమాలు త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసుకోనున్నాయి. ఈ లెక్కన ఈ సినిమాలన్నీ బుల్లితెరపై రావడానికి చాలా సమయమే ఉందని తెలుస్తోంది. ఎన్నెన్నో అంచనాల నడుమ రాబోతోన్న ఈ చిత్రాలు వెండితెర, బుల్లితెర మీద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.