ఆపత్కాలంలో ప్రాణాలు నిలబెట్టే వైద్యులు.. ఇప్పుడు ధనాపేక్ష థ్యేయంగా బ్రతుకుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తూ, ప్రైవేటు క్లినిక్స్ నడుపుకుంటున్నారు. తూతూ మంత్రంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తూ.. ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా పలాసలో వైద్యులు, సిబ్బంది కారణంగా ఓ పసిగొడ్డు ప్రాణాలు కోల్పోయాడు.
వైద్యో నారాయణో హరీ అంటారు పెద్దలు. భగవంతులు మనకు ఆయువు పోస్తే.. ఆపత్కాలంలో ప్రాణాలు నిలబెట్టేవాడు వైద్యులు. అయితే అది ఒకప్పటి మాట. లాభాపేక్ష లేకుండా వైద్యులు చికిత్స అందించేవారు. ధనిక, పేద అనే వ్యత్యాసం చూసేవారు కాదూ. కానీ నేటి కాలంలో వైద్యుల తీరే వేరు. ప్రభుత్వ ఆసుప్రతిలో పనిచేస్తూ.. మరో వైపు సొంత క్లినిక్‌లు పెట్టుకుంటున్నారు. డబ్బు సంపాదనే థ్యేయంగా బతుకుతున్నారు. ఒకసారి వీరి ప్రైవేట్ ఆసుప్రతిలో అడుగుపెడితే చాలూ.. 500 నోట్ల కట్టలను చదివించుకోవాల్సిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా సేవలందిస్తున్న వైద్యుల నిర్లక్ష్య ధోరణి కారణంగా నిండు ప్రాణాలు బలౌతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది.
పలాసకు చెందిన రాజాం సురేష్ అనే జర్నలిస్టు.. తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి డెలివరీ కోసం తీసుకెళ్లాడు. వెళ్లిన వెంటనే వైద్యం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు అక్కడి సిబ్బంది. ఐదు నిమిషాలైనా వైద్యులు రాలేదు. రాజాం సురేష్..డాక్టర్ గురించి సిబ్బందిని ఆరా తీయగా.. ఐదు నిమిషాల్లో వచ్చేస్తారంటూ సిబ్బంది వైద్యం చేయడం ప్రారంభించారు. ఓ గంటపాటు హడావుడి చేసి, తెలిసీ తెలియని వైద్యం చేసి పసిగొడ్డు ప్రాణం తీశారు. ఆ తరువాత డాక్టర్ సెలవులో ఉన్నారని, ఎనస్థీషియన్ కూడా లేరని వేరే చోటకు తీసుకువెళ్లాలని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో రాజాం సురేష్ నిరసనకు దిగారు.
‘నా భార్యకు పురిటినొప్పులు రావటంతో ఆసుపత్రికి తీసుకువచ్చాను. వైద్యులు లేరన్న విషయం ముందుగా చెప్పలేదు. ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు అంటూ కాలయాపన చేశారు. వైద్యురాలితో ఫోన్లో మాట్లాడుతూ తెలిసీ తెలియని వైద్యం చేసి నా బిడ్డను చంపేశారు. ఇది పూర్తిగా ఇక్కడి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతా. నాలా మరొకరి అన్యాయం జరగకూడదు. ఆర్థిక స్థోమత లేకే ప్రభుత్వ దవాఖానాకు వచ్చాం. ముందే చెప్పి కంటే అప్పో సప్పో చేసి వేరే చోటకు వెళ్లిపోయేవాళ్లం. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలి’ అని రాజాం సురేష్ వ్యాఖ్యానించాడు.
వాస్తవం ఏమిటంటే పలాస మెటర్నిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు అశ్వినీ ఆసుపత్రికి రాకుండా ఫోన్లోనే వైద్యం చేసేశారు. అక్కడి సిబ్బందికి ఫోన్లోనే సూచనలు చేయడంతో.. సిబ్బంది ఇష్టమొచ్చినట్లు బిడ్డను బయటకు లాగారు. ఈ క్రమంలో పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆమె తెలివిగా ముందుగానే పెట్టుకున్న సెలవు దరఖాస్తును తెరమీదికి తెచ్చారు. తాను సెలవులో ఉన్నానని కలరింగ్ ఇచ్చారు. బిడ్డ చనిపోయిందని తెలియటంతో బాధిత కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని, వైద్యులు లేరని చెబితే అప్పు చేసైనా సరే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేవాడినంటూ రాజాం సురేష్ వాపోయారు. ఈ సంఘటన బాధాకరమని, విచారణ జరిప్తామని డీసీహెచ్ డాక్టర్ జె. భాస్కరరావు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.