న్యూ ఢిల్లీ– వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం అంతకంతకు ఉత్కంఠ రేపుతోంది. ఆయన అరెస్ట్, బెయిల్ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉండగానే కుటుంబసభ్యుల కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రఘురామ కృష్ణరాజుపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఆయన కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. రఘురామ కృష్ణరాజు సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తనయుడు భరత్‌తో కలిసి గురువారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్‌నాథ్ సింగ్ లతో సమావేశమయ్యారు. వీరి ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్పీకర్ సభాహక్కుల కమిటీకి పంపించారు.
రఘురామ కృష్ణరాజు అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను కోరారు ఓం బిర్లా. రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు కాపీని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం హోంశాఖకు పంపింది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారన్న కక్షతోనే రాజ ద్రోహం కేసు పెట్టారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు ప్రాణాపాయం ఉందనన్న ఆయన కుటుంబ సభ్యులు, వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. లోక్ సభ స్పీకర్ తమకు తప్పకుండా న్యాయం చేస్తారని రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.