కులు రూరల్- పోలీసులు జనంతో ఎలా ఉంటారో పక్కన పెడితే.. పోలీసులంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. ఇక పైఅధికారుల పట్ల పోలీసులు ఎంతో నిబద్దతో, గౌరవంతో ఉంటారని వేరే చెప్పక్కర్లేదు. కానీ కొన్ని సందర్బాల్లో పోలీసులు సైతం సహనం కోల్పోతుంటారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లోను ఘర్షణలు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇదిగో ఇలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఏకంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్ పైనే చేయి చేసుకున్నాడు జిల్లా ఎస్పీ. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కులు ఎయిర్ పోర్టుకు విచ్చేసిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విమానాశ్రయానికి వెళుతుండగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ, కులు ఎస్పీ గౌరవ్ సింగ్ సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడే ఉన్న ఇతర సీఎం సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న చెంపదెబ్బ తిన్న ఆఫీసర్ కు సైతం కోపం వచ్చింది. మమ్మల్నే కొడతావా అంటూ ఆయన ఎస్పీని కాలితో తన్నాడు.
అంతే కాదు ఎస్పీని తన్నుకుంటూ అలా ముందుకు వెళ్లాడు. ఇంకేముంది సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ తన్నులకు తాళలేక ఎస్పీ ఒక్కసారిగా పరుగులు తీశాడు. అనుకోని ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసు అధికారులు ఇరువురిని పక్కకు తీసుకెళ్లడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తన కారులోనే కూర్చొని ఉన్నారు. సీఎం సెక్యూరిటీ అధికారి, ఎస్పీకి జరిగిన గొడవ గురించి తెలుసుకున్న డీజీపీ ఈ ఘటనపై సమగ్ర వివరణకు ఆదేశించారు. సీఎం సెక్యూరిటీని ఎస్పీ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.