స్పోర్ట్స్ డెస్క్- బీసీసీఐ చైర్మెన్ సౌరవ్ గంగూలీ మరోసారి కరోనా భారిన పడ్డారు. గత సోమవారం కరోనా సోకడంతో ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొందారు. ఆక్కడ ఆయనకు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ థెరపీ అందించడంతో కోలుకున్నాడు.
కరోనా నుంచి కోలుకున్న సౌరవ్ గంగూలీ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పోస్ట్ కోవీడ్ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో సౌరవ్ కు కరోనా డెల్టాప్లస్ వేరియంట్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
సౌరవ్ గంగూలీకి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి స్పష్టం చేసింది. ఐతే ఇన్ఫెక్షన్ తీవ్రత ఆందోళన చెందే స్థాయిలో లేకపోవడంతో ఇంటి వద్దే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరో 15 రోజుల పాటు సౌరవ్ గంగూలీ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారులు తెలిపారు.
పలువురు క్రికెట్ రంగ ప్రముఖులు గంగూలీ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌరవ్ గంగూలీ ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఆయన కోలుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.