హైదరాబాద్- సోనూసూద్.. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా కష్టకాలంలో సోనూసూద్ సాయం అందుకున్న వారెందరో ఉన్నారు. అడిగిన వారికి లేదనకుండా హెల్ప్ చేశారు సోనూ. అలా దేశవ్యాప్తంగా రియల్ హీరో అయ్యారు. ఇక అసలు విషయం ఏంటంటే.. సోనూసూద్ తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు.
సోనూసూద్ పనిచేస్తున్న తీరుని మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ కు వివరించారు. సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను కేటీఆర్ కు వివరించారు. తన తల్లి స్పూర్తితో తాను సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ చెప్పారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని కేటీఆర్ తో పంచుకున్నారు.
తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర పోషిస్తూనే, కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనూసూద్ తెలిపారు. సోనూసూద్ చేస్తున్న సేవ కార్యక్రమాలను అభినందించిన కేటీఆర్ ఆయనను శాలువాతో సత్కరించారు. అంతే కాదు ప్రత్యేక జ్ఞాపికను అందిచారు. ఈ సమావేశంలో సోనూసూద్ తో పాటు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.