విశాఖపట్నం- కరోనా విపత్కర సమయంలో జనం చాలా దుర్బరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కరోనా సోకిన చాలా కుటుంబాలు చితికిపోయాయి. కరోనా మహమ్మారి మనిషిలోని మానవత్వాన్ని చంపేసింది. దీంతో తమ వారికి కరోనా సోకితే ఆ కుటుంబ సభ్యుుల పడే పాట్లు వర్ణణాతీరం. ఇదిగో అలాంటి హృదయవిధారమైన ఘటన ఒకట విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు కరోనా సోకిన నాన్న కోసం స్వీపర్ గా మారిన ధీన గాధ ఇది. అసలేం జరిగిందంటే.. విశాఖ లోని అక్కయ్యపాలేనికి చెందిన మధుకిషన్ ఎంబీఏ చదివాడు. ప్రభుత్వానికి చెందిన1902 స్పందన కాల్ సెంటర్‌లో ఏడాదిన్నరగా కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నారు. మధుకిషన్ తండ్రి సుదర్శనరావుకి 67 ఏళ్లు.
ఆయన రిటైర్డ్ షిప్ యార్డు ఉద్యోగి. కొన్ని రోజుక్రితం ఆయనకు కరోనా సోకడంతో ఈనెల 2న కేజీహెచ్‌లో చేర్పించారు. ఆస్పత్రిలోని సీఎస్‌ఆర్ బ్లాక్ నాలుగో అంతస్తులోని ఐసీయూ పడకలో ఉంచి ఆయనకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో సుదర్శనరావు ఆస్పత్రిలోని బాత్ రూంలో కాలు జారి పడిపోవడంతో ఆయనకు దెబ్బలు తగిలాయి. అక్కడ ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా వాళ్లు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆ తరువాత మధుకిషన్ వచ్చి వైద్యులను కలవడంతో చికిత్స చేశారు. ఐతే ఆస్పత్రిలో సిబ్బంది తండ్రిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కొడుకు ఆవేధన చెందాడు. అందుకే తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆయన దగ్గర ఉండాలని మధుకిషన్ నిర్ణయించుకున్నాడు. ఐతే పేషెంట్ తో పాటు ఉండటానికి అనుమతి లేదని ఆస్పత్రి వర్గాలు తేల్చి చెప్పాయి.
దీంతో ఏంచేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఆతనికి ఓ ఐడియా వచ్చింది. ఆస్పత్రిలో తాత్కాలికంగా పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆస్పత్రి వైద్యులను ఒప్పించి వెంటనే స్వీపర్ గా పనిలో చేరిపోయాడు. విధుల్లోకి చేరగానే రాత్రి ఆస్పత్రికి వెళ్లి చూస్తే తండ్రి మరుగుదొడ్డి దగ్గర పడిపోయి ఉన్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సిబ్బందిని పిలివడంతో వాళ్లు వచ్చి పరిక్షించి ఆయన ఎప్పుడో చనిపోయారని చెప్పారు. దీంతో ఆ కొడుకు గుండె పగిలేలా ఏడ్చాడు. తండ్రి కోసం స్వీపర్ గా మారినా ఫలితం లేకుండా పోయిందంటూ అతను కన్నీరు పెట్టుకోవడం అందరిని కలిచివేసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయాడంటూ అధికారులకు పిర్యాదు చేశాడు మధుకిషన్.