హైదరాబాద్ క్రైం- తెలుగు రాష్ట్రాల్లో క్రైం రేట్ అంతకంతకు పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు. ఎక్కడ, ఎప్పుడు, ఏ నేర వార్త వినాల్సి వస్తోందోనని అందరిలో భయం కనిపిస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా నేరాలు మాత్రం ఆగడం లేదు. పైగా పెరిగిపోతున్న నేరాలు సమాజాన్ని, పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ కసాయి తండ్రి తన రెండేళ్ల కొడుకును కిరాతకంగా హత్య చేశాడు. అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత అమానుషంగా గొంతుకోసి చంపేశాడు. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హాసిబ్‌కి హస్రత్ బేగంతో ఆరేళ్ల కిందట పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో హాసిబ్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.
మరి ఇంతలో ఏమైందో తెలియదు కాని శక్రవారం సాయంత్రం ఈ దారుణానికి ఒడిగట్టాడు. కన్నకొడుకుని అతికిరాతకంగా హత్య చేశాడు హసీబ్. తన రెండేళ్ల పెద్ద కొడుకు ఇస్మాయిల్ ను మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. భార్య హస్రత్ బేగం గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకుని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే బాబు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
బాబు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హసీబ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేనందు వల్లే, కొడుకును హత్య చేశాడని బంధువులు చెబుతున్నారు. రెండేళ్ల తన కొడుకు భర్త చేతిలోనే హత్యకు గురికావడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. కుటుంబ సభ్యులంతా శోఖసంద్రంలో మునిగిపోయారు.