హైదరాబాద్- తెలుగు సినీ పరిశ్రమలో విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయి. సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మొన్ననే హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజుల క్రితం సిరివెన్నెలను సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. నవంబర్ 24న సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారని కిమ్స్ వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యులతో సిరివెన్నెలకు వైద్యం అందిస్తున్నామని వారు చెప్పారు. ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని డాక్టర్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం సిరివెన్నెల ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తామని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తరువాత ఆయన ఆరోగ్యం గురించి రకరకాల వార్తలను రావడంతో, వాటిని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.
సీతారామాశాస్త్రి కేవలం న్యుమోనియాతోనే బాధపడుతున్నారని, కిమ్స్ ఆసుపత్రిలో అందుకు సంబందించిన చికిత్స కొనసాగుతోందని తెలిపారు. సిరివెన్నెలపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, అభిమానులెవరు కంగారు పడవద్దని కుటుంబ సభ్యులు చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.