ఫిల్మ్ డెస్క్- మంగ్లీ.. ఈ తెలంగాణ సింగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జానపద గీతాలు పాడే మంగ్లీ, ఇప్పుడు సినిమా పాటలతో బాగా క్రేజ్ సంపాదించుకుంది. జానపదం అయినా, భక్తి గీతమైనా, ఐటం సాంగ్ అయినా.. మంగ్లీ పాడితే దాని స్థాయి వేరేలా ఉంటుంది. ఐతే మంగ్లీ పాడిన పాటలు కొన్ని సందర్బాల్లో వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి.
మొన్నా మధ్య మంగ్లీ పాడిన ఓ భక్తి పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వివాదంపై మంగ్లీ కూడా సున్నితంగానే స్పందించింది. ఇదిగో ఈ క్రమంలో తాజాగా మరోసారి మంగ్లీ వ్యవహారం చర్చనీయాంశమైంది. తన అభిమానుల తాకిడికి మంగ్లీ తట్టుకోలేకపోయింది. తనతో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన అభిమానుల దుమ్ముదులిపింది మంగ్లీ. షూటింగ్ లో భాగంగా సెట్ కు వచ్చిన మంగ్లీని ఆమె ఫ్యాన్స్ చుట్టు ముట్టినట్టు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. దీంతో సింగర్ మంగ్లీ తీవ్ర ఆసహనానికి గురైంది. సెల్ఫీలు దిగేందుకు వచ్చిన అభిమానుల ఫోన్ లు పగలగొట్టు అంటూ మంగ్లీ తన సిబ్బందికి చెబుతూ చిందులు తొక్కింది. అంతే కాదు తన అసిస్టెంట్‌ను మంగ్లీ కొట్టినట్టు కూడా వీడియోలో కనిపిస్తోంది. బండికి ఫోన్ చేయ్ రా దరిద్రుడా అంటూ అరిచేసినట్టు కూడా వినిపిస్తోంది.
ఏదేమైనా మంగ్లీ ఇలా ఎందుకు ప్రవర్తించింది.. అక్కడి పరిస్థితులు ఏంటన్నవి మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. మంగ్లీకి సంబందించిన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.