ఇటీవలల టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్లు అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్నారు. తాము అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్నట్లు స్వయంగా వారే సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ సింగర్ అస్వస్థతకు గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖులను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్లు తాము పలు రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్నామని ప్రకటించిన సంగతి విదితమే. సమంత మయోసైటిస్, రేణు దేశాయ్ గుండెకు సంబంధించిన సమస్యతో సహా పలువురు నటీనటులు తాము ఎదుర్కొబోతున్న అనారోగ్య సమస్యల గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించి భావో్ద్వేగానికి గురయ్యారు. మరో వైపు రానా వంటి నటులు కూడా తనకు చూపు సరిగా లేదని, అదేవిధంగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపుడుతున్నట్లు చెప్పారు. వీరే కాకుండా మమతా మోహన్ దాస్, కల్పిక గణేష్, పూనమ్ కౌర్, హంసా నందిని వంటి నటీ మణులు వారికున్న అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రముఖ స్టార్ సింగర్ ఒకరు అస్వస్థతకు గురయ్యారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత బాంబే జయశ్రీ (Bombay Jayashri) అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఆమె ప్రస్తుతం యుకెలో ఉన్నారు. బ్రిటన్ సంగీత పర్యటనలో భాగంగా ఆమె అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందించినట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆమె కుమారుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సంగీత కచేరీల కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌కు వచ్చిన బాంబే జయశ్రీ ఆరోగ్యం దెబ్బతింది. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)లో సమర్థులైన సిబ్బంది, ఆమెతో పాటు ఉన్న కళాకారుల కారణంగా ఆమెకు సకాలంలో వైద్య సహాయం అందింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది, కోలుకుంటుంది, ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం‘ అని ఓ ప్రకటనలో పేర్కొంది. జయశ్రీ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఆమె నరాలకు సంబంధించిన శస్ర్త చికిత్స తీసుకున్నట్లు సమాచారం.
జయశ్రీ రామ్ నాథ్ అలియాస్ బాంబే జయశ్రీ కర్నాటక సంగీతంలో పండితులు. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో బహు భాషల్లో గుర్తుండిపోయే పాటలు పాడారు. ఇటీవలే ఆమెను సంగీత కళానిధి అవార్డుతో సంగీత అకాడమీ సత్కరించింది. అయితే తనకు ఈ గుర్తింపునివ్వడంపై జయశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ సంవత్సరం సంగీత కళానిధి అవార్డుతో సంగీత అకాడమీ నన్ను సత్కరించినందుకు ఈ క్షణంలో నేను గౌరవంగా, థ్రిల్‌గా ఉన్నాను’ అని పేర్కొన్నారు. తెలుగులో ఇద్దరు మూవీలో శశివదనే శశివదనే సాంగ్ తో పాటు ఆమె శ్రీరామ్ మూవీలో తియ్య తియ్యని కళలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో, గజినీలో హృదయం ఎక్కడున్నదీ, డియర్ కామ్రేడ్ ఓ కలలా కథలా వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఎక్కువ తమిళ డబ్బింగ్ సినిమాలకు ఆమె గాత్రాన్ని అందించారు.