బెంగళూరు-డ్యానీ.. ఈ పేరు తమిళ హీరో సూర్య సింగం సినిమా చూసిన వారికి బాగా గుర్తుంటుంది. ఆ సినిమాలో అంతర్జాతీయ డ్రగ్ ముఠా నాయకుడిగా డ్యానీ నటించాడు. అతి క్రూరమైన అండర్ వరల్డ్ డాన్ గా డ్యానీ నటన, అతని భయంకరమైన రూపం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సింగం సినిమాలో ఇంటర్నేనల్ డ్రగ్ డీలర్ గా నటించిన డ్యానీ గ్యాంగ్ లో ఓ వ్యక్తి ఇప్పుడు నిజ జీవితంలోను డ్రగ్ సరఫరా చేసి కటకటాలపాలయ్యాడు.
స్వతహాగా నైజీరియన్ అయిన చాక్ విమ్ మాల్విన్… చాలా కాలంగా భారత్ లో నివసిస్తున్నాడు. సినిమాల్లో నటించడమే ఇతని ప్రధాన వృత్తి. సింగం సినిమాతో పాటు పలు తమిళ సినిమాల్లో నటించాడు మాల్విన్. అయితే.. కరోనా సమయంలో సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో మాల్విన్ కి కష్టాలు మొదలయ్యాయి.
ఇంకేముంది సహజంగానే నైజీరియన్ దేశస్థులకు డ్రగ్ ముఠాలతో సంబంధాలు ఉంటాయి. మాల్విన్ సైతం డబ్బుల కోసం డ్రగ్ డీలర్ గా మారిపోయాడు. షూటింగ్ లు లేక డబ్బులు కోసం ఇబ్బంది పడ్డ మాల్విన్.. తప్పనిసరి పరిస్థితుల్లో డ్రగ్ అమ్మడం మొదలుపెట్టాడు. బెంగళూరులో కొందరికి డ్రగ్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మాల్విన్ హ్యాష్ ఆయిల్ తో పాటు హెరాయిన్ ను అమ్ముతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్నాడు. ఈ మధ్య షూటింగ్ లు లేకపోవడంతో డబ్బులకు ఇబ్బంది పడ్డ మాల్విన్, డ్రగ్ సరఫరా చేస్తున్నాడని కర్ణాటక పోలీసులు తెలిపారు. సింగం సినిమాలో లాగే చివరికి నిజ జీవితంలో కూడా మాల్విన్ డ్రగ్ కేసులో పోలీసులకు చిక్కడం ఆశ్చర్యం కలిగిస్తోంది.