ఎంత కష్టపడినా ఫెయిల్యూర్స్ ఎదురౌతుంటే ఎంతో ఆవేదన చెందుతూ మనకు లక్ లేదని భావిస్తాం. అదే ఊహించని విధంగా ఏదైనా జరిగితే అదృష్టమంటే ఇదేరా అని పొంగిపోతాం. అయితే అదృష్టం వరించిన కొద్ది సేపటికిే దరిద్ర దేవత తలుపుతట్టింది కొంత మంది కూలీలకు . ఇంతకు ఏం జరిగిందంటే..?
అదృష్టం ఒక్కసారే తలుపు తడితే.. దరిద్ర దేవత తలుపు తీసేంత వరకు కొడుతుందని పెద్దలు అంటుంటారు. ఎంత కష్టపడినా అదృష్టం ఆవగింజంత అయినా ఉండాలంటారు. ఏదైనా జరగాల్సినవి జరక్కపోయినా, లేదంటే పెద్ద మొత్తంలో చేజారిపోయినప్పుడు ఈ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అదే విధంగా పక్కవాడి జీవితంలో ఏదైనా అద్భుతాలు జరిగినా కూడా అనుకునే మాట ఎంతైనా లక్ ఉండాలిరా. మధ్యతరగతి మనిషి అనేక విషయాలను అదృష్టానికి ముడిపెడుతూ బతికేస్తుంటారు. కొన్ని సార్లు అదృష్టం వరించేలోపు దురదృష్టం మనల్ని పలకరిస్తుంది. దీనికి ఉదాహరణగా నిలిచారు ఉపాధి కూలీలు. లంకీ బిందెల రూపంలో దొరికిన సొత్తును పంచుకున్న కొన్ని సేపట్లోనే వారి ఆనందం ఆవిరి అయిపోయింది. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంతకు వారు ఊహించని అదృష్టాన్ని దుర దృష్టంగా మార్చింది ఎవరంటే..?
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేసే కూలీలు రోజు ఉదయాన్నేపనులకు వెళతారు. రోజులానే ఆ రోజు కూడా పనులకు వెళ్లి కూలీలు.. తవ్వుతుండగా.. రెండు మట్టి కుండలు కనిపించాయి. ఏంటా అని తెరిచే లోపు అందులో 30 వెండి నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దొరికిన నాణేలను సమానంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు. అలాగే పంచుకున్నారు. ఎవరి వాటాలు వారు తీసుకున్నారు. ఇంటికి వెళదామని భావించారు. ఇంతలో వారు ఊహించని విధంగా రంగ ప్రవేశం చేశారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. విషయం ఎలా తెలిసిందో కానీ.. వారి వద్ద నుండి వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకేముందీ కూలీల ముఖాలన్నీ ఒక్కసారి వెల వెల బోయాయి. అది ప్రభుత్వ సొమ్ము కిందకు వస్తుంది కాబట్టి కిమ్మనకుండా ఇచ్చేశారు.