ఫిల్మ్ డెస్క్- సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. కేవలం దక్షిణాది సినిమాలకు గుర్తింపు ఇవ్వడం, ఇక్కడి నటీనటులను గౌరవించుకోవడం కోసం సైమా వేడుక నిర్వహిస్తూ అవార్డ్స్ ఇస్తున్నారు. 2019, 2020 లో కరోనా కారణంగా ఈ వేడుకలు జరగలేదు.
ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడిన నేపథ్యంలోనే సెప్టెంబర్ 18,19 తేదీల్లో హైద్రాబాద్‌లో సైమా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సారి 2019 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ అందిస్తున్నారు. శనివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకలో విజేతలకు అవార్డ్స్ ను అందించారు.
ఇక ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాకు గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు. అంతే కాదు మహర్షి చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్, ఉత్తమ దర్శకుడిగా వంశీ పైడిపల్లి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ గేయ రచయితగా శ్రీమణి అవార్డ్స్ అందుకున్నారు.
నాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోగా, ఉత్తమ వినోదాత్మక సినిమాగా ఎఫ్ 2 మూవీ అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటిగా సమంత (ఓ బేబి), ఉత్తమ సహాయ నటిగా లక్ష్మి (ఓ బేబి) సైమా అవార్డ్స్ కైవసం చేసుకున్నారు.
ఇక ఉత్తమ నేపధ్య గాయకుడిగా ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ పాడినందుకుగాను అనురాగ్ కులకర్ణికి, ఉత్తమ గాయనిగా మజిలీ సినిమాలోని ప్రియతమా పాట పాడినందుకు చిన్మయి సైమా అవార్ట్ అందుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో జెర్సీ సినిమాకు ఉత్తమ నటుడిగా నాని, డియర్ కామ్రెడ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా రష్మిక మందన్న ఎంపికయ్యారు.