ఇప్పుడంటే వెస్టిండీస్ పర్యటన అంటే భారత జట్టుకు సరదాగా మారింది కానీ.. ఒకప్పుడు కరీబియన్లతో ఆడాలంటే భయపడని జట్టుంటూ లేదు. ముఖ్యంగా భారత్ ప్రత్యర్థి అంటే మాత్రం ఆ ఆటగాడు చెలరేగిపోయేవాడు.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టు బుధవారం నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో తలపడనుంది. ఈ పోరులో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కుర్రాళ్లతో నిండిన కరీబియన్ జట్టు అసలు పోటీనిస్తుందా.. భారత్ ఎంతా భారీ విజయం సాధిస్తుంది.. క్రికెట్ విశ్లేషకుల వ్యాఖ్యలన్నీ ఇలాగే సాగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రోజురోజుకు ప్రమాణాలు కోల్పోతున్న వెస్టిండీస్ జట్టు.. ప్రస్తుతం రోహిత్ సేనకు పోటీనిచ్చే స్థాయిలో లేదనేది కాదనలేని వాస్తవం. కానీ ఒకప్పుడు విండీస్ పర్యటన అంటే టీమ్‌ఇండియాతో సహా ప్రపంచ జట్లన్ని గజగజలాడిపోయేయి. 80, 90 దశకాల్లో కరీబియన్ దీవుల్లో బ్యాటింగ్ చేయాలంటే డబుల్ హెల్మెట్ తప్పనిసరి అనే వాళ్లు. ఆ తర్వతి కాలంలో ఆ జట్టు బౌలింగ్ ప్రమాణాలు తగ్గినా.. బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టేవారు. అందులో ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్ అంటే ఓ ప్లేయర్ ప్రత్యేక ఇన్నింగ్స్‌లతో అదరగొట్టేవాడు. అతనెవరో తెలుసా!
19వ శతాబ్దంలో భారత్ నుంచి వలస వెళ్లి గయానాలో స్థిరపడ్డ ఓ కుటుంబంలో జన్మించిన శివనరైన్ చందర్ పాల్.. అంతర్జాతీయ స్థాయిలో టన్నుల కొద్ద పరుగులు రాబట్టాడు. టెస్టు క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్ అనిపించుకున్న చందర్‌పాల్.. భారత్‌పై మ్యాచ్ అంటే చాలు విజృంభించేవాడు. అతడిని ఔట్ చేసేందుకు మన కెప్టెన్‌లు నానా ప్లాన్‌లు వేసేవారంటే అతిశయోక్తి లేదు. ఒక్కసారి క్రీజులో పాతుకుపోతే.. చాపకింద నీరులా పరుగులు సాధిస్తూ.. భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించే స్వభావం గల చందర్‌పాల్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ మన సొంతమైనట్లే అని ప్లేయర్లంతా ఆ వికెట్ కోసం కాచుకు కూర్చునేవారు. టెస్టు కెరీర్‌లో 164 మ్యాచ్‌లాడి 11,867 పరుగులు సాధించిన చందర్‌పాల్ 30 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన అతడి టెస్టు కెరీర్‌లో 51.37 సగటుతో పరుగులు రాబట్టాడంటేనే అతడేంటో అర్థం చేసుకోవచ్చు. 1994లో ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్ ఆడిన చందర్‌పాల్.. 2015లో అదే జట్టుపై చివరి మ్యాచ్ ఆడాడు. సంధి దశలో సాగుతున్న విండీస్ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరించిన చందర్ పాల్.. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు చెలరేగిపోయేవాడు. దీనికి అతడి గణాంకాలే నిదర్శనం
టీమ్‌ఇండియాతో ఆడిన 25 టెస్టుల్లో చందర్‌పాల్ 63.85 సగటుతో పరుగులు సాధించాడు. ఇది అతడి టెస్టు కెరీర్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. భారత్‌పై 25 టెస్టుల్లో 2171 పరుగులు చేసిన చందర్ పాటు 7 సెంచరీలు, 10 హాఫ్‌సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా 2002లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టుకు చందర్‌పాల్ చుక్కలు చూపాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జార్జ్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన చందర్‌పాల్.. రెండో టెస్టులో 67 పరుగులతో ఆకట్టుకున్నాడు. మూడో మ్యాచ్‌లో అజేయంగా 101 పరుగులు చేసిన చందర్‌పాల్ నాలుగో టెస్టులో 136 రన్స్ కొట్టాడు. ఇక ఆఖరి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో 58, 59 పరుగులు చేసి ఆ జట్టు సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో 3 సెంచరీలు, 3 హాఫ్‌సెంచరీలతో మొత్తం 562 పరుగులు చేసిన చందర్‌పాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్రస్తుతం చందర్‌పాల్ స్థాయి ఆటగాడు వెస్టిండీస్ జట్టులో లేకున్నా.. అతడి వారసుడు టగ్‌నరైన్ చందర్‌పాల్.. తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలని తహతహలాడుతున్నాడు. శివ్‌నరైన్ లాగే భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో పాటు.. క్రీజులో పాతుకుపోయే అలవాటు ఉన్న టగ్‌నరైన్ తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటాడా చూడాలి.