షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంతలా క్రేజ్‌ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకుంది. అయితే కొన్నాళ్లుకు ఆమె సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన షకీలా తన కూతురును హీరోయిన్‌గా పరిచయం చేస్తూ చిత్రనిర్మాణం మొదలుపెట్టింది – అదీ తన సొంత ఓటీటీ ఫ్లాట్ ఫారమ్మీద!
ఒకప్పుడు కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్‌తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. శృంగార పాత్రలే కాకుండా అన్ని రకాల పాత్రల్ని చేయడానికి రెడీ అయిన షకీలా ఈ మధ్య సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట చిత్రంలో నటించి మెప్పించింది.
రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలకు అట్టర్ ప్లాప్, రొమాంటిక్ పేర్లు ఖరారు చేశారు. వీటిల్లో షకీలా కుమార్తె మిలా హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ చెప్పిన స్క్రిప్ట్స్ నచ్చాయనీ, ఈ రెండు చిత్రాల్లో మిలా హీరోయిన్‌గా నటిస్తోందనీ, గోవాలో అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నామనీ, చిత్ర పరిశ్రమలోకి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ‘కె. ఆర్. డిజిటల్ ప్లెక్స్’ పేరుతో సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నామనీ షకీలా ప్రకటించింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో కోట్లు పెట్టిన తీసిన సినిమాలను క్యాష్ చేసుకోవాడానికి వరంలా కనిపిస్తోంది ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్. “కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్” ఓటిటి ద్వారా కొత్తవాళ్లనీ కొత్త చిత్రాలనీ సపోర్ట్ చేస్తామని దర్శకుడు రమేష్ కావలి తెలియజేసారు. రామానాయుడు స్టూడియోలో రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.