పూణే (రీసెర్చ్ డెస్క్)- సీరం ఇనిస్టిట్యూట్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ భారతీయ కంపెనీ పేరు మారుమ్రోగిపోతోంది. ప్రపంచంలో అంతకంతకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల్లో మన దేశానికి చెందిన సీరం కంపెనీ ఒకటి. ఇక సీరం సంస్థ గురించి చెప్పే ముందు మనం ఓ సూక్తిని గర్తు చేసుకోవాలి. అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.. ఇక అద్భుతం జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది అక్షరాలా సీరం ఇనిస్టిట్యూట్ కు వర్తిస్తుంది. సీరం సంస్థ ప్రస్థానం గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. సీరం ఇనిస్టిట్యూట్ ను అదర్ పూనావాలా తండ్రి సైరస్ పూనావాలా సుమారు 55 ఏళ్ల క్రితం అంటే 1966లో స్థాపించారు. అప్పట్లో సైరస్ పూనావాలా గుర్రాలను పెంచేవారు. ఆయన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వాన్ని సైరస్ కొనసాగిస్తూ గుర్రాల వ్యాపారం చేసేవారట.
ముంబై లోని హాఫ్ కైన్ ఇనిస్టిట్యూట్ లో గుర్రాల సీరం నుంచి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేవారు. పూనావాలా గుర్రపుశాలలో ముసలివైన అశ్వాలను ఆ ఇనిస్టిట్యూట్ కు పంపించేవారు. అక్కడ వాటి సీరమ్ నుంచి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేవారు. ఐతే అప్పట్లో దేశ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్ ఉత్పత్తి ఉండేది కాదు. దీనివల్ల విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేవారు. ఈ అంశమే సైరస్ పూనావాలను బాగా ఆలోచింపజేసింది. ఓ సందర్బంలో పూనావాలా తన స్నేహితుడితో మాట్లాడుతుండగా మనమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టిందట. అంతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేసకుండా వెంటనే తన దగ్గర ఉన్న గుర్రాలన్నింటినీ అమ్మేసిన సైరస్ పూనావాలా, వచ్చిన 12 వేల డాలర్లతో 1966లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించారు. అదిగో అప్పటి నుంచి సీరం సంస్థ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచ మేటీ వ్యాక్సిన్ తయారీ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచంలో రకరకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే ప్రధాన కంపెనీల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రముఖమైంది. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ కూడా ఉత్పత్తి చేస్తూ కోట్లాది మంది ప్రాణాలు కాపాడుతోంది సీరమ్ ఇనిస్టిట్యూట్.
ఇక కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెంనీలే వెనుకడుగు వేసినప్పుడు సీరం సంస్థ అధిపతి అధర్ పూనావాలా మాత్రం దైర్యంగా ముందడుగు వేశారు. తన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి 1800 కోట్ల రూపాయలను కరోనా వ్యాక్సిన్ తయారీకి ఖర్చు చేశారు. ఉన్న ఆస్తులన్నింటినీ ధారపోసి రిస్క్ చేస్తున్నావని తండ్రి సైరస్ పూనావాల హెచ్చరించినా అధర్ పూనావాలా మాత్రం దేశానికి కరోనా వ్యాక్సిన్ అందిచాల్సిందేనని పట్టుదలతో సాహసం చేశారు. ఇంకేముంది అధర్ సాహసానికి ప్రతిఫలమే ఇప్పుడు కరోనా టీకా కోవీషీల్డ్. ప్రపంచంలో ఎంతో మంది ప్రాణాలను నిలుపుతున్న వ్యాక్సిన్ ను అందించి సీరం సంస్థ ప్రాణదాత అయ్యింది.