హైదరాబాద్- చారిత్రక కట్టడాాలు, పురాతన ఆలయాల్లో ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వాటిని ఇప్పటికీ ఎవ్వరు కనుక్కోలేకపోతున్నారు. వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాల్లోని నిగూడ రహస్యాలు ఇంకా రహస్యాలుగానే ఉన్నాయి. వాటి చిక్కుముడులు విప్పేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మన హైదరాబాద్ లోని ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. సుమారు 430 ఏళ్ల క్రితం మహమ్మద్ కులీ కుతుబ్ షా ఛార్మినార్ ను కట్టించారు. ఇన్నేళ్లు గడిచినా చార్మినార్ చెక్కుచెదరకుండా హైదరాబాద్ మహా నగర వైభవాన్ని చాటిచెబుతోంది. అలాంటి చార్మినార్ కు సంబందించిన ఓ ఆసక్తికరమైన రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
చార్మినార్ ఆవరణలో జనరేటర్ ఏర్పాటు చేసేందుకు పురావస్తు అధికారులు తవ్వకాలు చేపట్టారు. చార్మినార్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తవ్వకాలు చేస్తుండగా, అక్కడ అండర్ గ్రౌండ్ లో మెట్లు బయటపడ్డాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి చార్మినార్ వైపు మళ్లింది.
జనరేటర్ కోసం పురావస్తు శాఖ అధికారులు తవ్విత గుంతలో మెట్లు వంటి బండరాళ్లు బయటపడినట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ లో మెట్లు ఉన్నట్లు ప్రచారం జరగడంతో వాటిని చూసేందుకు స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో చార్మినార్ దగ్గర బారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
ఇక చార్మినార్ దగ్గర తవ్వకాలపై ఎంఐఎం పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారని ఎంఐఎం ప్రశ్నిస్తున్నారు. వ్యవహారం వివాదాస్పదం అవ్వడంతో పురావస్తు అధికారులు తవ్వకాలను నిలిపివేశారు. చార్మినార్ దగ్గర తవ్వకాలలో బయటపడిన రాళ్ల మెట్లు, గోల్కొండ కోట వరకు ఉన్న రహస్య దారికి చెందినవనే ప్రచారం జరుగుతోంది.