ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో ఆహారం, కూరగాయలు, పండ్ల విషయంలో అందరిలో అవగాహన పెరిగింది. అంతా పెరటి సాగు, మిద్దె సాగు ప్రారంభించి ఆర్గానిక్ కూరగాయలను పండించుకుంటున్నారు. అయితే అందరూ ఇళ్లలో టమాటా మొక్క నాటితే టమాటాలు, వంకాయ మొక్క నాటితే వంకాలు వస్తాయి. కానీ, ఈ మొక్కకి మాత్రం వంకాయలు, టమామాలు కలిసే కాస్తాయి. అంతేకాదు ఏది తిన్నా రెండింటి రుచి తెలుస్తుంది.
అవును.. మీరు చదివింది నిజమే. శాస్త్రవేత్తలు కొత్తరకం వంగడాలను సృష్టించే క్రమంలో వీటని రూపొందించారు. జనెటిక్ ఇంజినీరింగ్ నుంచి హైడ్రోపోనిక్ సాంకేతికత వరకు వ్యవసాయ పరిశ్రమ ఎదుగుతోంది. అలాంటి కొత్త పద్ధతుల్లో పండించినవే పొమాటో, బ్రిమాటో అనే సంకర జాతి కూరగాయలు. అయితే ఈ విధానం ఇప్పటిది కాదు 1977లోనే జర్మనీలో అభివృద్ధి చేశారు. ఆ విధానాన్నే వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటెబుల్ రీసెర్చ్ వారు అభివృద్ధి చేస్తున్నారు.
పొటాటో(బంగాళదుంప), టొమాటో(టమాటా)లను కలిపి పొమాటో అనే కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు. గత ఏడాది విజయవంతంగా ఈ పొమాటోని పండించారు కూడా. ఇప్పుడు కొత్తగా ఆ పొమాటో మొక్కకే గ్రాఫింగ్ పద్ధతిలో బ్రిమాటోని పండించారు. వంకాయను ఇంగ్లీష్ బ్రింజాల్ అంటారు కాబట్టి దీనికి బ్రిమాటో అని నామకరణం చేశారు. దీనిలో మూడు రకాల కూరగాయల గుణాలు ఉంటాయని చెబుతున్నారు. దేన్ని తిన్నా మూడింటి రుచిని ఆశ్వాదించవచ్చు అంటున్నారు.
అయితే ఈ గ్రాఫింగ్ విధానం మనం ప్రయత్నించలేనిదేమీ కాదు. ఈ విధానాన్ని ఇంటి దగ్గర కూడా ప్రయత్నించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. కాకపోతే మీరు ఎంచుకునే కూరగాయలు ఒకే కుటుంబానికి చెందినవి అయి ఉండాలి. ఆ ఒక్క నియమాన్ని పాటిస్తే మీరు కూడా ఇంటి దగ్గర ఈ గ్రాఫిక్ విధానంతో పొమాటో, బ్రిమాటో వంటి కూరగాయలను పండించుకోవచ్చు. బ్రిమాటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.