గుంటూరు- ఈ రోజుల్లో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. బయటకు ఎక్కడికో ఎందుకు, ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా కొంత మంది పేరెంట్స్ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న అమానుష ఘటనలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇదిగో తాజాగా గుంటూరులో ఇలాంటి జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రైవేట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విధ్యార్ధిని దసరా పండగ సెలవుల నేపధ్యంలో వారం రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. సెలవు రోజుల్లో ఎంతో ఉల్లాసంగా, సంతోషంగా గడిపింది. తల్లిదండ్రులతో సరదాగా ఆడి, పాడింది. తోటి పిల్లలతోను హ్యాపీగా ఆడుకుంది ఆ పాప. సోమవారం తిరిగి స్కూల్స్ తెరవడంతో పాఠశాలకు వెళ్లేందుకు రెడీ కావాలని తల్లి చెప్పింది.
ఐతే ఆ అమ్మాయి స్కూల్ పేరు చెప్పగానే ఆందోళన చెందింది. ముఖంలో ఏదో తెలియని భయం కనిపించింది. దీన్ని గమనించిన తల్లి, ఏదో తేడా వ్యవహారంలా ఉందని ఊహించింది. నిదానంగా ఏం జరిగిందని అడిగింది. తల్లి అలా అడగ్గానే ఆ అమ్మాయి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ పాప చెప్పిన విషయం విని ఆమె షాకైంది.
స్కూల్ లో పాఠాలు చెప్పే టీచర్ గత కొన్ని రోజులుగా ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. తనను అందరి పిల్లల ముందు, ఒక్కోసారి పక్క రూంలోకి తీసుకెళ్లి అసభ్యంగా తాకుతున్నాడని ఏడుస్తూనే చెప్పింది. స్కూల్ కు వెళ్లలేక, ఆ విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పుకోలేక ఇన్ని రోజులూ తనలో తనే కుమిలిపోయింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ స్కూల్ కు వెళ్లాలనే సరికి ఆ చిన్నారి గజ గజా వణికిపోయింది. స్థానికులతో కలిసి పాఠశాలకు వెళ్లి ఆ కీచక టీచర్ ను పట్టుకొని చితకబాది, పోలీసులకు అప్పగించారు.