అత్తింట్లో నిత్య నరకం అనుభవించిన ఆమె చావు అంచుల దాకా వెళ్లింది. అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆమె ఐఎఎస్ సాధించింది. నేటి యువతకు స్ఫూర్తిగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆనాటి కాలం నుంచి నేటి వరకు సమాజంలో ఆడపిల్లలంటే చిన్నచూపే. వారి జీవితంలో అన్ని ప్రతిభందకాలే. ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే భారంగా భావించే రోజులు ఇంకా ఉన్నాయి. ఆడపిల్ల చదువుకోవాలన్నా, బయటికి వెళ్లి ఉద్యోగం చేయాలన్న ఆంక్షలు, అణచివేతలు. ఇదే రీతిలో ఓ ఆదివాసి కుటుంబానికి చెందిన యువతికి చిన్నతనంలోనే పెళ్లైంది. కట్టుకున్న భర్త, అత్తింటి వేధింపులు ఆమెకు నిత్యనరకంగా మారాయి. కానీ అత్తింటి వేధింపులే ఆమెను మరింత ధైర్యవంతురాలిని చేశాయి. ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. అవమానాలే సోపానాలుగా మల్చుకుని ఐఎఎస్ సాధించింది. ఆమెనే ఐఎఎస్ సవితా ప్రధాన్. నేటి యువతకు స్ఫూర్తిగా మారింది. ఆమె లాగా కష్టాలు పడే ఆడపిల్లల కోసం హిమ్మత్ వాలీ లడ్కియా అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ధైర్యాన్ని నింపుతోంది.
చిన్నతనంలోనే 11ఏళ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో పెళ్లి..
ప్రస్తుతం సవితా ప్రధాన్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, చంబల్ కు అర్భన్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఐఎఎస్ సాధించడం వెనక ఉన్న తన కన్నీటి గాథను తెలియజేసింది. తను మాట్లాడుతూ.. ‘ మధ్యప్రదేశ్ లోని మండి గ్రామంలో నిరుపేద ఆదివాసి కుటుంబంలో జన్మించానని తెలిపింది. ఏడుగురు తోబుట్టలువులలో ఆమె మూడో సంతానమని, తన తల్లిదండ్రులు బీడి ఆకులు ఏరుకుంటూ, కూలీ పనులు చేస్తూ తమను పోషించేవారని చెప్పింది. తల్లిదండ్రులు తమను చదివించే స్థోమత లేకపోయినప్పటికి స్కూల్లో వచ్చే స్కాలర్ షిప్, యూనిఫాం, ఒక పూట దొరికే జావ కోసం బడిలో చేర్పించారని తెలిపింది. కష్టాలను ఇష్టంగా మలుచుకుని పదోతరగతి పాసయ్యానని తెలిపింది. ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. పది పాసైన నాకు పెళ్లి చేసేందుకు తన తల్లి దండ్రులు నిర్ణయం తీసుకున్నారని, తన కంటే 11 ఏళ్లు ఎక్కువ వయసున్న వ్యక్తితో పెళ్లి జరిపించారని తెలిపింది.
అత్తింటి వేధింపులతో నరకం..
పెళ్లైన నాటి నుంచి తనకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఒక పనిమనిషిలాగా చూసేవారని ఆవేధన వ్యక్తం చేసింది. నలుగుర్లోకి రాకూడదు, వాళ్లు తిన్న తర్వాతే తినాలి, నవ్వకూడదు, తలపై కొంగు తీయకూడదంటూ ఆంక్షలు పెట్టి వేధించేవారని తెలిపింది. వాళ్లు పెట్టిన ఆంక్షలకు ఎదురుతిరిగితే తన భర్త రక్తం వచ్చేలా కొట్టేవాడని తెలిపింది. ఇక వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సమయంలో తాను గర్భవతిని అని తెలిసిందని తెలిపింది. గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తనకు తిండి పెట్టేవారు కాదని, దాంతో ఆకలి తట్టుకోలేక రొట్టెలను లోదుస్తుల్లో రహస్యంగా తీసుకెళ్లి బాత్ రూం లలో తినేదాన్నని తెలిపింది. ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా వేధింపులు ఆగలేదని సవితా ప్రధాన్ చెప్పుకొచ్చింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది.
ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. సివిల్స్ వైపు అడుగులు
ఫ్యాన్ కు ఉరేసుకునే సమయంలో కిటికీలోంచి బయటకు చూడగా తన అత్త అదంతా గమనిస్తుందని కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదని తెలిపింది. ఇలాంటి వారికోసం నేనెందుకు చావాలి? పిల్లల కోసమైనా బ్రతకాలి అని ఇంట్లో నుంచి బయటకు వచ్చానని చెప్పింది. ఆ తర్వాత ఇండ్లల్లో పనులు చేస్తూ, పిల్లలకు ట్యూషన్ లు చెప్తూ వచ్చే ఆదాయంతో బిఎ పూర్తి చేశానని తెలిపింది. తర్వాత ఎంఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో యూపిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని, సివిల్స్ సాధిస్తే మంచి జీతంతో పాటు, పేద వారికి సేవ చేయవచ్చని భావించానని వెల్లడించింది. నిరంతరం కష్టపడి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి 24 ఏళ్లకే ఛీఫ్ మున్సిపల్ అధికారిని అయ్యానని సవితా ప్రధాన్ తెలిపింది. కాగా ఇంట్లో నుంచి బయటికి వచ్చాక కూడా తన భర్త నుంచి వేధింపులు తగ్గలేదని దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసానని, ఆ తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకున్నానని తెలిపింది. ఇప్పుడు తన మనసుకు నచ్చిన వ్యక్తి హర్షని రెండో వివాహం చేసుకున్నాని తెలిపింది. అమ్మాయిలు ధైర్యం చేసి ముందడుగు వేస్తే జీవితంలో విజయవంతంగా రాణించవచ్చంటుంది సవితా ప్రధాన్.