స్పోర్స్ట్ డెస్క్- ప్రపంచ క్రికెట్ మ్యాచ్ లలో అత్యంత ఉత్కంఠ రేపేది భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అని వేరే చెప్పక్రర్లేదు. ఈనెల 24న భారత్-పాక్ జట్ల మధ్య జరిగే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గ్రూప్-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.
ఈ మ్యాచ్ ల అనంతరం మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్ లు అక్టోబర్ 23 నుంచి మొదలవుతాయి. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న ఉత్కంఠభరితమైన మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ కోడలు, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భారత్-పాక్ మ్యాచ్ సమయంలో విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకే ఆ రోజు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సానియా చెప్పింది. పాక్ తో భారత్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు దేశాల అభిమానులు ఉద్వేగంతో ఉంటారని, అందుకే తాను ఆ రోజు సోషల్ మీడియా ను కాసేపు మాయం అవుతానని సానియా పేర్కొంది.
గతంలో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసిన నేపథ్యంలో సానియా మీర్జా ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉంటుంది. అన్నట్లు సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాక్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. మరో ఆసక్తిరమైన విషయం ఏంటంటే పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్ లలో భారత్ ను ఓడించింది లేదు.