హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాక తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డిని ముందు వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మెల్లమెల్లగా మనసు మార్చుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి తలొంచక తప్పదని తెలుసుకుంటున్నారు. ఐతే ఇదే సమయంలో కొంత మంది నేతలు రేవంత్ నాయకత్వాన్ని ఎదురించి కాంగ్రెస్ ను వీడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఐతే సాధారనంగా రిజైన్ చేస్తే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ పార్టీని వీడుతూ రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ అధిష్టానంపైనా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. రేవంత రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆరునెలల్లో ఖాళీ అవబోతోందని కౌశిక్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు కాళ్ల వద్ద తాకట్టు పెట్టబోతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఠాగూర్‌కి 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష్య పదవి తెచ్చుకున్నారంటూ కామెంట్ చేశారు.
అంతే కాదు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటల కాంగ్రెస్‌లో చేరితే గెలిచి ఉండేవాడని, కానీ బీజేపీలో చేరాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 16న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలుస్తోంది.