న్యూఢిల్లీ-హైదరాబాద్- నాలుగేళ్ల సస్పెన్స్ కు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిపై ఎట్టకేలకు ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే రేవంత్ నే టీపీసీసీ పదవి వరించింది. రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.
ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను నియమించింది ఏఐసీసీ. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపీశెట్టి నిరంజన్, టి.కుమార్‌రావు, జావెద్ అమీర్‌లను ప్రకటించింది ఢిల్లీ అధిష్టానం.
గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై తర్జనభర్జన కొనసాగింది. రేవంత్ రెడ్డితో పాటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ తదితరులు టీపీసీసీ పదవికి పోటీ పడ్డారు. ఢిళ్లీ వెళ్లి మరీ పార్టీ అధ్యక్ష్య పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపింది. మరి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఏవిధంగా స్పదింస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.